విద్వేషపు మంటలు -నీచమైన ఎత్తుగడలు : తిప్పికొడదాం - శక్తి చాటుదాం : సీఎం కేసీఆర్..!!
తెలంగాణ జాతీయ సమైక్యతదినోత్సవం వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ సమాజం అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి..గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నేడు అనేక రంగాల్లో ముందుందని చెప్పారు.
తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయికంటే ముందుందన్నారు. ప్రభుత్వ కృషి వల్ల జలవనరులు, పంటల దిగుబడి పెరిగిందని వివరించారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా నేడు తెలంగాణ ఎదిగిందని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు.

తెలంగాణలో అశాంతిని సృష్టించే కుట్ర
రాష్ట్రంలో ప్రశాంతమైన పారిశ్రామిక వాతావరణం ఉందని చెప్పారు. ప్రశాంతమైన వాతావరణం వల్లే రాష్ట్రానికి భారీగా పెట్టబడులు వస్తున్నాయన్నారు.ఐటీ రంగ వృద్ధిరేటులో జాతీయ స్థాయికంటే ముందున్నామని వివరించారు. సీఎం కేసీఆర్ఐటీ రంగం ఉత్పత్తిలో ఇటీవలే బెంగళూరును అధిగమించామని చెప్పుకొచ్చారు.
కొందరు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ నేల శాంతి సౌభాగ్యంతోనే ఉండాలని ఆకాంక్షించారు. 8 ఏళ్లలో తెలంగాణలో సర్వతోముఖాభివృద్ధి జరిగిందన్న సీఎం..కొన్ని మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఆనాడు చిన్న ఏమరుపాటు వల్ల 58 ఏళ్లు ఎంతో నష్టపోయామని గుర్తు చేసారు. మతోన్మాద శక్తుల నుంచి మరోసారి జాగ్రత్తపడాల్సిన అవసరముందని హెచ్చరించారు.
అదమరిస్తే అంతే సంగతులు
చరిత్రను వక్రీకరించి తెలంగాణను మలినం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.రెప్పపాటు కాలం ఆదమరిచినా... విచ్ఛిన్నకర శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని చెప్పారు.తెలంగాణ నేలపై నెలకొన్న ప్రశాంత వాతావరణానికి విఘాతం కలగనీయొద్దని సూచించారు. శాంతి సౌభ్రాతృత్వాలు ఉంటేనే అభివృద్ధి స్థిరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. విద్వేషాలు విడనాడి ప్రపంచ శాంతి కోసం పాటుపడదామంటూ పిలుపునిచ్చారు.
చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. స్వార్ధ ప్రయోజనాల కోసం సామాజిక సంబంధాల నడుమ ముళ్ల కంపలు పెడుతున్నారంటూ సీరియస్ అయ్యారు. మనుషుల మధ్య విభజన ఏ విధంగా సమర్ధనీయం కాదన్నారు.

ఐక్యంగా ఉందా..శక్తిని చాటుదాం
మతం చిచ్చు మానవ సంబంధాలనే మంట గలుపుతుందని హెచ్చరించారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బుద్ది కుశలతను చూపించాల్సిన అవసరం ఉందని సూచించారు.
సెప్టెంబర్ 17 చరిత్రను వక్రీకరిస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఎన్నటికీ ఈ నేల అశాంతి అలజడితో కల్లోలంలోకి దిగజారద్దని అప్రమత్తం చేసారు. అప్రతిహతంగా జాతి నిర్మాణంలో భాగం కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం.. ఈ ఎనిమిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ముఖ్యమంత్రి వివరించారు.












Click it and Unblock the Notifications