వరంగల్‌లో దారుణం... చిట్టీ డబ్బులు అడిగిన దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చిట్ ఫండ్ ఏజెంట్ భార్య
హన్మకొండ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ చిట్ ఫండ్ ఏజెంట్,అతని భార్య దారుణానికి ఒడిగట్టారు. చిట్టి డబ్బులు అడిగినందుకు ఓ దంపతులపై దాడికి పాల్పడ్డారు. వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ దంపతులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... హన్మకొండలోని బాలసముద్రం ప్రాంతానికి చెందిన పిట్టల రాజు కుమార్‌పల్లిలో సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్నాడు. హంటర్‌రోడ్డుకు చెందిన గణేశ్ అనే ఏజెంట్ ద్వారా ఓ చిట్ ఫండ్ సంస్థలో ప్రతీ నెలా డబ్బులు కడుతున్నాడు. నాలుగు నెలల క్రితం డబ్బులు అవసరమై చిట్టీ పాడుకున్నాడు. అయితే చిట్టీ పాడి 7 నెలలు గడిచినా... అతనికి రావాల్సిన డబ్బులు రాలేదు.

ఈ నేపథ్యంలో పిట్టల రాజు.. గణేశ్ ఇంటికి వెళ్లి డబ్బుల కోసం నిలదీశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదే క్రమంలో శుక్రవారం(సెప్టెంబర్ 3) గణేశ్,అతని భార్య కావ్యతో కలిసి రాజు సెల్‌ఫోన్ షాప్ వద్దకు వెళ్లాడు. అక్కడ రాజు,అతని భార్యతో ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన గణేశ్ భార్య కావ్య... వెంట తెచ్చిన పెట్రోల్‌ను గణేశ్ సెల్‌ఫోన్ షాపుపై చల్లి నిప్పంటించింది.
కావ్య చేసిన పనికి షాక్ తిన్న రాజు దంపతులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే కావ్య వారిపై కూడా పెట్రోల్ చల్లి నిప్పంటించింది. ఆపై గణేశ్,కావ్య అక్కడినుంచి పరారయ్యారు. ఈ దాడిలో రాజు తీవ్రంగా గాయపడగా... అతని భార్య తప్పించుకోగలిగింది. స్థానికులు రాజును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యాయంగా తమకు రావాల్సిన డబ్బులు అడిగినందుకే ఇంత దారుణానికి ఒడిగట్టారని రాజు భార్య ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జనగామలో ఆర్మీ జవాన్ మృతి :
జనగామ జిల్లాలోని బాచ్యా తండాకు చెందిన ఆర్మీ జవాన్ గుగులోతు లక్‌పతి(38) గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన జమ్ము కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. లక్‌పతికి గుండెపోటు వచ్చినట్లు ఆర్మీ అధికారులు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. లక్‌పతికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈర్యా-నేజమ్మ దంపతులకు ఏడో సంతానమైన లక్‌పతి ఇంటర్ తర్వాత ఆర్మీ ఉద్యోగంలో చేరారు. లక్‌పతి పార్థివ దేహాన్ని సైనిక అధికారులు జనగామకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications