మంచిగున్నావ్.. నాకు నచ్చినవ్... ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై... సీఐ అనుచిత వ్యాఖ్యలు..?
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో స్థానిక సీఐ ఓ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భూ వివాదంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో సీఐ తనతో అసభ్యంగా మాట్లాడారని ఆ మహిళ ఆరోపించింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే సదరు సీఐ ఆమెతో రాజీ కుదుర్చుకోవడంతో బాధితురాలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే...కారేపల్లి మండలంలోని రేలకాయపల్లి గ్రామానికి చెందిన భుక్యా మమత అనే మహిళ తమ భూ వివాదంపై ఇటీవల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. మమతకు పెళ్లి అయినప్పటికీ భర్తతో గొడవల కారణ:గా రేలకాయలపల్లిలోని పుట్టింట్లోనే ఉంటోంది. తన తల్లికి చెందిన భూమిని ఇటీవల ఆమె బాబాయి భుక్యా లక్ష్మణ్ ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తూ మమత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చేను గట్టును ఎందుకు ఆక్రమించావని ప్రశ్నించినందుకు తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.

లక్ష్మణ్‌కు ఎన్నిసార్లు చెప్పినా తమ మాట వినడం లేదని... తమ పత్తి చేనును అర ఎకరం వరకు ఆక్రమించుకున్నాడని మమత ఆరోపించింది. అయితే తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సిన సీఐ తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆమె ఆరోపించడం కలకలం రేపింది. 'నువ్వు మంచిగున్నావ్... నాకు నచ్చినవ్..' అంటూ సీఐ మాట్లాడారని ఆ మహిళ ఆరోపించింది. అంతేకాదు,రాత్రి 11.30గంటల వరకు తనను పోలీస్ స్టేషన్‌లో ఒక్కదాన్నే కూర్చోబెట్టారని... పైగా పెద్దవాళ్లతో గొడవులు ఎందుకని తనకే సలహాలిచ్చారని పేర్కొంది.
సీఐపై ఆరోపణలు చేసిన ఆ మహిళ ఆ మరుసటిరోజు వెనక్కి తగ్గింది. అనుకోకుండా జరిగినదాన్ని మనసులో పెట్టుకోవద్దని సీఐ కోరారని... సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపింది. కాబట్టి ఈ విషయాన్ని పత్రికల్లో రాయొద్దని ఆమె స్థానిక విలేకరులను కోరింది. మరోవైపు మమత చేసిన ఆరోపణలపై సీఐ స్పందిస్తూ... తానెలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు.ఫిర్యాదు పత్రం సరిగా లేకపోవడంతో మరొకటి రాయాలని కాస్త దబాయించిన మాట నిజమేనని... కానీ ఎటువంటి అసభ్య మాటలు మాట్లాడలేదని స్పష్టం చేశారు. మొత్తం మీద ఆ మహిళ వెనక్కి తగ్గడంతో ఈ వివాదం సద్దుమణిగిపోయింది.












Click it and Unblock the Notifications