జయసుధకు బీజేపీలో సీటు ఖరారు - కమలం పార్టీలోకి కాంగ్రెస్ నేతలు..!!
తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీలో చేరికల వేగం పెరిగింది. బీజేపీలో తిరిగి చేరకలు మొదలయ్యాయి. బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీ పూర్తిగా నష్టపోయిందనే ప్రచారం నడుమ..కొత్తగా చేరికలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ కాషాయం కండువా కప్పుకోవటానికి సిద్దమయ్యారు. కాంగ్రెస్ నేతలు పలువురు ఢిల్లీలో బీజేపీ నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
బీజేపీ గూటికి కాంగ్రెస్ నేతలు: కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిదులు బీజేపీ బాట పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, ఉమ్మడి మెదక్ జిల్లా దివంగత నేత బాగారెడ్ది తనయుడు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి శనివారం ఢిల్లీలో కమలం తీర్థం పుచ్చుకున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ కే లక్ష్మణ్, ఈటల రాజేందర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ సమక్షంలో రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జావడేకర్ వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జయసుధకు సీటుపై హామీ: సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధను బీజేపీలో చేరటం ఖాయమైంది. ఈ మేరకు ఆమెతో బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే చర్చలు జరిపింది. అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరనున్నారు. గతంలోనూ జయసుధను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు.
అయితే మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరినప్పటి నుంచి రెండు రాష్ట్రాల్లో తనకు పరిచయం ఉన్న నేతలతో టచ్‌లో ఉంటున్నట్లు సమాచారం. జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపాందారు. 2014లోనూ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆమె బీజేపీలో చేరితే మళ్లీ సికింద్రాబాద్ నుంచే పోటీకి హామీ దక్కినట్లు తెలుస్తోంది. టీడీపీ, వైసీపీ లో పని చేసిన జయసుధ ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు.
మరిన్ని చేరకల దిశగా: ఎన్నికల సమయంలో మరిన్ని చేరికలు ఉండేలా కార్యాచరణ రూపొందించుకుంటామని కిషన్ రెడ్డి చెప్పారు. కాగా, జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ అధిష్ఠానం తనకు హామీ ఇచ్చిందని జైపాల్‌రెడ్డి తెలిపారు. మరోవైపు మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సొత్కు సంజీవరావు, అమరాజుల శ్రీదేవి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
వీరిద్దరూ ఆగస్టు 1న ఢిల్లీలో అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో వారు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications