తెలంగాణకు మోడీ కానుకగా విమానయాన పరిశోధన కేంద్రం: రూ. 400 కోట్లతో నిర్మాణం
రూ. 400 కోట్లతో బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పౌర విమానయాన పరిశోధనా కేంద్రం(కారో) ఏర్పాటు చేయనుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం భారీ కానుక ఇచ్చింది. రూ. 400 కోట్లతో బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పౌర విమానయాన పరిశోధనా కేంద్రం(కారో) ఏర్పాటు చేయనుంది. భారతదేశంలో తొలి గృహ-5 ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ కేంద్రం ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. ఈ మేరకు వివరాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
శరవేగంగా పనులు సాగుతున్నాయని.. ఈ ఏడాది జులై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో 2018లో కారోకు శంకుస్థాపన జరిగిందన్నారు. అప్పటి కేంద్రమంత్రి సురేష్ ప్రభు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పౌర విమానయాన పరిశోధన సంస్థకు శంకుస్థాపన చేశారని కిషన్ రెడ్డి తెలిపారు.

కాగా, బేగంపేటలోని 27 ఎకరాల్లో పౌర విమానయాన పరిశోధన సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పరిశోధన, విమానయాన అభివృద్ధి, ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్, ఎయిర్ ట్రాఫికింగ్ మేనేజ్‌మెంట్ , కమ్యూనికేషన్ డొమైన్ ఎమ్యులేషన్, నెట్‌వర్క్స్ ఎమ్యులేటర్, అనాలసిస్ ల్యాబ్ ఏర్పాటవుతాయి. వీటితోపాటు ప్రమాద విశ్లేషణ కేంద్రం, సైబర్ సెక్యూరిటీ ల్యాబ్, డేటా మేనేజ్ మెంట్, ప్రాజెక్ట్ సపోర్ట్, సాఫ్ట్ వేర్ సొల్యూషన్ సెంటర్లు కూడా ఈ కేంద్రంలో ఏర్పాటు చేయనున్నారు.
కారో ప్రాజెక్టును ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ. 402.13 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. విమానాశ్రయం పక్కనే ఉన్న 20 ఎకరాల విస్తీర్ణంలో అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు. పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన పలు భవనాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కాగా, ఇక్కడే ఏవియేషన్ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు కానుంది.












Click it and Unblock the Notifications