బీజేపీ నేతలకు అవమానం: సీఎం దత్తత గ్రామంలో చెప్పులు, చీపుర్లు విసిరారు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు గ్రామానికి వచ్చిన బీజేపీ బృందంతో గ్రామ టీఆర్‌ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.
డబుల్ బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు, సీఎం దత్తత గ్రామంలో ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో 30 మంది పార్టీ నాయకులు వచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామాన్ని సీఎం దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తుంటే మీరెందుకొచ్చారంటూ రోడ్డుకు అడ్డంగా తాళ్లు కట్టారు.
అనంతరం బీజేపీ నాయకులను తీవ్ర పదజాలంతో దూషిస్తూ చెప్పులు, చీపుర్లు విసిరేశారు. అయితే ఈ పరిస్థితిని ఊహించని బీజేపీ నేతలు షాక్‌కు గురయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త వాటర్ ట్యాంకు ఎక్కి 'బీజేపీ గో బ్యాక్' అంటూ నినాదాలు చేశాడు. ఇలా గ్రామంలో రెండు గంటలకు పైగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఇలా ఊహించని పరిణామంతో బీజేపీ నేతలు ఖంగుతిన్నారు. సీఎం దత్తత గ్రామంలోనే విపక్షాల పరిశీలనకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీ నేతల ఆందోళనకు నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రోడ్డుపైనే వారికి ఎదురుగా బైఠాయించారు.
ఇరువర్గాలు రోడ్డుపై బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ తర్వాత గ్రామానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడం లేదంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్న తమకు పోలీసులు భద్రత ఎందుకు ఎందుకు కల్పించడం లేదని బీజేపీ నేత రామక్రిష్ణారెడ్డి ప్రశ్నించారు. హుస్నాబాద్ సీఐ భూమయ్య, హుస్నాబాద్, తిమ్మాపూర్ ఎస్సైలు వచ్చి టీఆర్‌ఎస్ నేతలకు సర్దిజెప్పి తప్పించి పరిస్థితిని చక్కదిద్దారు. పోలీసు బందోబస్తు మధ్య బీజేపీ నాయకులు గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications