ఖబడ్దార్ మోడీ.. తెలంగాణ పులిబిడ్డగా ఢిల్లీకోటను బద్దలు కొడతాం: జాతీయ రాజకీయాలపైనా సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ జనగామ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే ఢిల్లీ కోటను బద్దలు కొడతామని, ఖబర్దార్ మోడీ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. పిడికెడు లేని బీజేపీ నేతలు తమ జోలికొస్తే ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తమను ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తాం
జనగామ జిల్లా యశ్వంతపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నామని పేర్కొన్నారు. తమను ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో రైతులను మోసం చేస్తే ఊరుకోబోమని తేల్చి చెప్పిన కేసీఆర్, తమ ప్రాణం పోయినా సరే బావుల వద్ద మోటర్లకు కరెంట్ మీటర్ లు పెట్టమని స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకుండా ఎదిగామని పేర్కొన్న కేసీఆర్, దేశంలో అనేక రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉందని వెల్లడించారు.

తెలంగాణ పులిబిడ్డగా అవసరమైతే ఢిల్లీ కోటను బద్దలు కొడతాం
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని పేర్కొన్న కేసీఆర్ కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా ఉన్న వాటితో సరిపెట్టుకున్నామని, ఆదాయాన్ని సృష్టించామని వెల్లడించారు. కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, రైల్వే జోన్లు ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని, రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. టిఆర్ఎస్ యుద్ధం చేసి గెలిచిన పార్టీ అని పేర్కొన్న కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని, తెలంగాణ పులిబిడ్డగా అవసరమైతే ఢిల్లీ కోటను బద్దలు కొడతాం అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

నరేంద్ర మోడీ జాగ్రత్త... ఉడుత ఊపులకు భయపడేది లేదు
నరేంద్ర మోడీ జాగ్రత్త అంటూ కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు సీఎం కేసీఆర్ . ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని మోడీ ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు కేసీఆర్. ఇక ఇదే సమయంలో సిద్దిపేట ప్రజలు తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని, రాష్ట్ర ప్రజలంతా ఆదరించి పంపిస్తే ఢిల్లీ కోటను బద్దలు కొట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. తాను తెలంగాణ పులిబిడ్డ అని చెప్పుకున్న కేసీఆర్ బిజెపి నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని హెచ్చరికలు జారీచేశారు.

బిజెపి బిడ్డలారా మమ్మల్ని ముట్టుకుంటే మసి చేస్తాం
జనగామ టౌన్ లో టీఆర్ఎస్ కార్యకర్తలను బిజెపి కార్యకర్తలు కొట్టారని, అయినప్పటికీ తాము బిజెపి కార్యకర్తలను టచ్ చేయమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బిజెపి బిడ్డలారా మమ్మల్ని ముట్టుకుంటే మసి చేస్తామంటూ హెచ్చరించారు. మేము ఊదితే మీరు అడ్రస్ లేకుండా పోతారు అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. మీ జాగ్రత్తలో మీరు ఉంటే మా జాగ్రత్త లో మేముంటామంటూ కెసిఆర్ వెల్లడించారు. ఇక ఇదే సమయంలో జనగామ జిల్లాపై వరాల జల్లు కురిపించిన కేసీఆర్, అభివృద్ధికి పట్టం కడుతున్నామని పేర్కొన్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ జనగామ వేదికగా జాతీయ రాజకీయాలలో పీఎం మోడీని డీ కొడతామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications