కేసీఆర్ ఒప్పందాల పై విచారణకు రేవంత్ ఆదేశం..!!
ముఖ్యమంత్రి రేవంత్ సంచలన నిర్ణయం ప్రకటించారు. కేసీఆర్ హయాంలో జరిగిన ఛత్తీస్ ఘడ్ తో జరిగిన విద్యుత్ ఒప్పందం మీద విచారణకు నిర్ణయించారు. జ్యుడిషియల్ విచారణకు శాసనసభలోనే రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ పరిస్థితుల పైన ప్రభుత్వం సభలో శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ చర్చలో భాగంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పైన మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. వీటి పైన విచారణకు ఆదేశించాలని జగదీశ్వర్ ప్రభుత్వానికి సవాల్ చేసారు.
న్యాయ విచారణకు నిర్ణయం : ఈ చర్చలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ గత ప్రభుత్వం విద్యుత్ సెంటిమెంట్ అస్త్రంగా మలచుకొని రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. ఆర్దిక దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. ఛత్తీస్ ఘడ్ తో వెయ్యి మెగావాట్ల ఒప్పందం లోనే విద్యుత్ ఉపయోగించుకున్నా..ఉపయోగించుకోకున్నా డబ్బులు చెల్లించాలని ఉందని వివరించారు. ఈ ఒప్పందం వెనుక నాటి ప్రభుత్వ ఉద్దేశాలు ఏందో విచారణ లో తెలుతాయని వివరించారు. నాడు సభలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ వీటి పైన నిలదీసిందని..ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకుందని చెప్పుకొచ్చారు.

డైలాగ్ వార్ : చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. ముందుగా యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో 10 వేల కోట్లను జగదీశ్ రెడ్డి తిన్నారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి ధీటుగా స్పందించారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదా కమిషన్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జగదీశ్ రెడ్డి కోరారు. ఆ విచారణలో దోషులు దొరికితే వాళ్లకు శిక్ష వేయాలన్నారు. లేదంటే ఆధారాలు లేకుండా అసంబద్ధ ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలన్నారు.

విద్యుత్ పై శ్వేతపత్రం : దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆ విచారణతో పాటు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై కూడా విచారణ చేయాలన్నారు. వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి రేవంత్ నాటి ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని స్పష్టం చేసారు. ప్రభుత్వం ప్రకటించిన శ్వేత పత్రంలో ప్రస్తుతం విద్యుత్ రంగం అప్పులు 81,016 కోట్లుగా ప్రభుత్వం శాసనసభా వేదికగా ప్రకటన చేసింది. విద్యుత్ రంగం సమస్యల్లో ఉందని వివరించింది. దీనిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఖండిస్తూ నాటి ప్రభుత్వంలో చేపట్టిన సంస్కరణలను వివరించారు.












Click it and Unblock the Notifications