రేవంత్-నాగార్జున కెమిస్ట్రీ చూశారా ? ఏమీ జరగనట్లే..!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఇవాళ టాలీవుడ్ పెద్దలు భేటీ అయి పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ చర్చల్లో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం నుంచి టాలీవుడ్ కు అందాల్సిన సహకారంపైనా చర్చించారు. అయితే ఇన్ని విషయాల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం మాత్రం కనిపించింది. అది సీఎం రేవంత్ రెడ్డి, హీరో అక్కినేని నాగార్జున సాన్నిహిత్యం.
ఈ ఏడాది హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాతో కూల్చివేతలకు దిగింది. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను చెరువును ఆక్రమించి కట్టారని నోటీసులు జారీ చేసిన సర్కార్.. స్పందించే లోపే కూల్చివేతలు చేపట్టింది. దీనిపై నాగార్జున కోర్టుకెళ్లినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనిపై కోర్టులో ఆ తర్వాత నాగార్జున న్యాయపోరాటం చేసినా ఆస్తినష్టం మాత్రం తప్పలేదు. అలాగే ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

సీన్ కట్ చేస్తే ఇవాళ టాలీవుడ్ ప్రముఖులతో రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు నిర్వహించిన భేటీకి అక్కినేని నాగార్జున కూడా ఇండస్ట్రీ పెద్దగా హాజరయ్యారు. ఈ భేటీ జరిగిన కమాండ్ కంట్రోల్ సెంటర్ హాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి రాగానే ముందుగా సినీ పెద్దలు రాఘవేంద్రరావు, మురళీ మోహన్ ఆయనకు స్వాగతం పలికి పూలబొకేలు ఇచ్చారు. వీరి తర్వాత నాగార్జున కూడా రేవంత్ రెడ్డిని కలిసి ఈ భేటీ నిర్వహణపై ధన్యవాదాలు చెబుతున్నట్లు కనిపించారు. రేవంత్ కూడా నాగార్జున చేతుల్లో చేతులు వేసి సంతోషంగా కనిపించారు. మొత్తం మీద వీరిద్దరూ ఎన్ కన్వెన్షన్ ఘటన తర్వాత ఇలా కనిపించడం చూపరుల్ని ఆకట్టుకుంది.












Click it and Unblock the Notifications