మీ ఫామ్ హౌస్ లు ఎక్కడివి? శ్వేతపత్రం విడుదలపై కేటీఆర్ కు రేవంత్ డిమాండ్!
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ తో బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆస్తులను టార్గెట్ చేశారు. సిరిసిల్లలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇదే సమయంలో కేటీఆర్ కుటుంబ ఆస్తులపై ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో కేటీఆర్, కేసీఆర్, సంతోష్ రావులపై తీవ్ర విమర్శలు చేశారు. ''సిరిసిల్ల భూములపై శ్వేతపత్రం అడుగుతున్నారు. మీ ఆస్తులు, మీ తండ్రి, సంతోష్ రావు, హరీష్ రావు, బంధువుల ఆస్తులపై శ్వేతపత్రం ఇవ్వండి. జన్వాడలో కేటీఆర్ ఫామ్‌హౌస్, శంకర్‌పల్లిలో కవిత ఫామ్‌హౌస్, మొయినాబాద్‌లో హరీష్ రావు ఫామ్‌హౌస్, ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పాలని నిలదీశారు.

హైటెక్ సిటీ వద్ద మూడు ఫైవ్ స్టార్ హోటళ్లు ఎలా వచ్చాయి?'' అని ప్రశ్నించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నేత కార్మికుల ఆత్మహత్యలు, గల్ఫ్ వలసలు ఆపలేకపోయారని నిలదీశారు. 2009లో కేటీఆర్‌ను 172 ఓట్ల మెజారిటీతో గెలిపించారని, ప్రజల ఓట్లను నోట్లుగా మార్చుకున్నారని విమర్శించారు.
సిరిసిల్ల ప్రజల ఓట్లు కేటీఆర్‌కు వేల కోట్ల ఆస్తులుగా మారాయని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే సిరిసిల్ల జిల్లాకు రూ.1,730 కోట్లు కేటాయించిందన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో రూ.2,234 కోట్లు ఖర్చు చేశారని పోల్చి చెప్పారు. వేములవాడ దేవాలయ అభివృద్ధి, యంగ్ ఇండియా స్కూళ్లు, పోలీస్ స్టేషన్లు, రైతు రుణమాఫీ వంటి పనులు చేపట్టామని తెలిపారు.
ఈసారి సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేయండి. ప్రజల అభివృద్ధి బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని సీఎం పిలుపునిచ్చారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పద్మశాలి అభ్యర్థిని పంపాలని, స్థానిక ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడికి సూచించారు. సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
