సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణా అప్పుల షాకింగ్ లెక్కలు చెప్పిన హరీష్ రావు!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర భవిష్యత్తు కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రజా పాలన దినోత్సవంలో రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే మాట్లాడారని పేర్కొన్న హరీష్ రావు ఆర్థిక సంఘాన్ని తప్పుదోవ పట్టించేందుకు బురద చల్లుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పును తెలివిగా బిఆర్ఎస్ ప్రభుత్వఖాతాలో వేశారని తెలంగాణ ప్రభుత్వం పైన హరీష్ రావు మండిపడ్డారు.
తెలంగాణ అప్పులు, వాస్తవాలపై హరీష్ రావు ఏమన్నారంటే
తెలంగాణ అప్పులు, వాస్తవాలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 23వ తేదీన విడుదల చేసిన శ్వేత పత్రంలో నాలుగు రకాల అప్పులు చూపించారని, రెండు రకాల అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని శ్వేత పత్రంలో క్లియర్ గా మెన్షన్ చేశారని హరీష్ రావు పేర్కొన్నారు. శ్వేత పత్రంలో గవర్నమెంట్ హామీలేనివి, గవర్నమెంట్ కట్టనివి 59,414 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పారని గుర్తు చేశారు.

రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలే
గవర్నమెంట్ హామీ ఉండి గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేనివి 95,462 కోట్లు అని చెప్పారని, మొత్తం ప్రభుత్వం కట్టాల్సిన అవసరం లేని అప్పులు 1,54,876 కోట్లు అని హరీష్ రావు గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రకటనలో పచ్చి అబద్దాలు చెప్పారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న అప్పును కూడా రేవంత్ రెడ్డి భీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో చేసిన అప్పుగా జమ చేశారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలి
తెలంగాణ అప్పు 4.26 లక్షల కోట్లు ఉంటే 6.85 లక్షల కోట్ల పైన ఉందని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. జై తెలంగాణ అననివాళ్లు అమరవీరుల స్థూపం దగ్గర శ్రద్ధాంజలి ఘటించారని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని ప్రజలకు మంచి పరిపాలన అందించాలంటూ హరీష్ రావు హితవు పలికారు.
రేవంత్ చెప్పిన లెక్క తప్పుల తడక
రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి లాగా వ్యవహరించలేదని హరీష్ రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్రం అనివార్యంగా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్న హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కంతా తప్పులతడక అంటూ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications