బతుకమ్మ కానుకగా మహిళలకు రూ.2500, కళ్యాణలక్ష్మి క్రింద రెండు తులాల బంగారం.. మ్యాటర్ ఇదే!
తెలంగాణా మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ నుండి శుభవార్త చెప్పారు. బతుకమ్మ పండగ నుంచి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింద రెండు తులాల బంగారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లు ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై తెలంగాణ ఫ్యాక్ట్‌చెక్ టీమ్ స్పష్టత ఇచ్చింది. ఇది పూర్తిగా మార్పిడి చేసిన, ఏఐ సాయంతో తయారైన డీప్‌ఫేక్ వీడియో అని వారు ధ్రువీకరించారు.
ఫ్యాక్ట్‌చెక్ వివరాల ప్రకారం, వీడియోలో సీఎం రేవంత్‌రెడ్డి దృశ్యాలు నిజమైనవే. కానీ ఆడియోను మార్చేశారు. 2025 ఏప్రిల్‌లో రవీంద్రభారతిలో జరిగిన 892వ బసవ జయంతి వేడుకల అసలు వీడియోను తీసుకుని, దానికి కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన కొత్త ఆడియోను జోడించారు. ఏఐ డిటెక్షన్ పరికరాలతో పరిశీలించగా ఆడియో డీప్‌ఫేక్‌గా తేల్చారు. దీంతో సీఎం కొత్త హామీలు ప్రకటించినట్లు ప్రజల్లో భ్రమ కల్పించేలా ఈ వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు.

అయితే వైరల్ అవుతున్న అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం భాగం. దీని కింద కుటుంబంలో పెద్దగా ఉన్న మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే ఎల్పీజీ సిలిండర్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో కూడా ఈ వివరాలు స్పష్టంగా పేర్కొన్నారు.
కానీ బతుకమ్మ పండగ నుంచి ఈ సాయం ప్రారంభమవుతుందని గానీ, కల్యాణలక్ష్మి కింద రెండు తులాల బంగారం ఇస్తామని గానీ సీఎం ఎప్పుడూ ప్రకటించలేదు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం తెలంగాణలో ఇప్పటికే అమల్లో ఉంది. అర్హులైన కుటుంబాలకు వివాహ సమయంలో ఆర్థిక సాయం అందించే ఈ పథకం కింద ఒక తులం బంగారం ఇస్తామని మాత్రమే ప్రకటించారు.
రెండు తులాలు అనే విషయం ఆరు గ్యారంటీల్లో లేదు. ఇటీవల ఈ పథకంపై హైకోర్టు స్టే విధించిన సందర్భం కూడా ఉంది. ప్రస్తుతం డీప్‌ఫేక్ వీడియోలు, మార్పిడి చేసిన ఆడియోలు సోషల్ మీడియాలో వతెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోలను చూసి వెంటనే నమ్మకుండా, ప్రభుత్వ అధికారిక ప్రకటనలు, వెబ్సైట్లు, ప్రెస్ నోట్స్ ద్వారా మాత్రమే సమాచారం నిర్ధారించుకోవాలని ఫ్యాక్ట్‌చెక్ టీమ్ ప్రజలకు సూచించింది.












Click it and Unblock the Notifications
