జనవరి తర్వాత హైదరాబాద్ లో టాప్ విదేశీ యూనివర్సిటీల క్యాంపస్ ల ఏర్పాటు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్‌ఎఫ్‌ఐ) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్ నూతన క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. అదే సందర్భంగా క్యాంపస్ మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరించి, భవనాల డిజైన్‌లను సమీక్షించి కొన్ని మార్పులు సూచించారు. ఈ క్యాంపస్‌ను 2028 జూన్ 2 నాటికి పూర్తి చేయాలని స్పష్టమైన లక్ష్యం నిర్దేశించారు.
ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, అవసరమైన నిధులు, అనుమతులు, ఇతర సదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ సంస్థకు తానే వ్యక్తిగతంగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని ప్రకటించారు.ఈ కొత్త క్యాంపస్ రాజేంద్రనగర్‌లోని ప్రస్తుత క్యాంపస్ స్థానంలో నిర్మించబడనుంది. మూసీ నది ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ప్రస్తుత క్యాంపస్, పరికరాలను కొత్త స్థలానికి తరలించనున్నారు.

పీహెచ్‌ఎఫ్‌ఐ ఇన్‌స్టిట్యూట్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్, హెల్త్‌కేర్ పాలసీ, వ్యాధి నిఘా, విద్య, సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో ముఖ్యమైన పాత్ర పోషించనుంది. ఇది డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ ప్రధాన క్యాంపస్‌గా, బెంగళూరు మరో క్యాంపస్‌గా పనిచేస్తుంది. రాబోయే ఐదేళ్లలో దాదాపు 2,500 మంది విద్యార్థులు, పరిశోధకులతో అకడమిక్ కమ్యూనిటీని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటువ్యాధులు, పాండమిక్ సిద్ధత, నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్, మాతృ-శిశు ఆరోగ్యం, వన్ హెల్త్ అప్రోచ్, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై పరిశోధనకు ప్రాధాన్యత ఇస్తారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో విధానపరమైన గందరగోళం లేదని, పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు పూర్తి భద్రత, సహకారం అందిస్తామని పునరుద్ఘాటించారు. భూమి, నీరు, అనుమతులు, మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక విధానాలు రూపొందించామన్నారు. విద్య, వైద్యం, పరిశ్రమలు, సేవా రంగాల్లో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని చెప్పారు. ఐఎస్‌బి, నల్సార్ వంటి విద్యాసంస్థలు హైదరాబాద్‌కు ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని, అదే విధంగా పీహెచ్‌ఎఫ్‌ఐ వైద్య రంగంలో అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉస్మానియా ఆస్పత్రి, టిమ్స్ ఆసుపత్రుల అభివృద్ధికి సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రతి సంవత్సరం రూ.2,500 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. క్యాన్సర్‌ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించి రోగుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. పదేళ్ల ఆరోగ్యశ్రీ డేటాను విశ్లేషిస్తే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు.
ఫ్లోరైడ్ సమస్యతో పాటు మూసీ కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, మూసీని ప్రక్షాళన చేయడం తప్పనిసరని స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో దేశంలోని బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40 శాతం జరుగుతోందని, ఎలీ లిల్లీ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా సంస్థ బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తోందని సీఎం ప్రస్తావించారు. జనవరి తర్వాత హైదరాబాద్‌లో పలు విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు ప్రారంభం కానున్నాయని తెలిపారు.
నాణ్యమైన విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడికే తీసుకొస్తున్నామన్నారు. తెలంగాణ రైజింగ్-2047 అభివృద్ధి ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, హెల్త్, ఎనర్జీ, టూరిజం, ఇన్వెస్ట్‌మెంట్ పాలసీలు స్పష్టంగా ఉన్నాయని చెప్పారు.పీహెచ్‌ఎఫ్‌ఐ ను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేదిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.













Click it and Unblock the Notifications
