మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం!!
సీఎం రేవంత్ రెడ్డి పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుండి పాలనలో తనదైన దూకుడును కొనసాగిస్తున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సాగుతున్న ఆయన పాలన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరో సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్టు రద్దుచేసి ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో విస్తరణ అవసరం లేదని పాత బస్తీని విమానాశ్రయానికి అనుసంధానం చేయాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మెట్రో విస్తరణ కోసం గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని హైదరాబాద్ నగరం చుట్టూ మెట్రోను విస్తరించాలని నిర్ణయించింది.

69 వేల కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది. పటాన్ చెరువు నుండి నార్సింగి వరకు 22 కిలోమీటర్లు, తుక్కుగూడ, బెంగళూరు, పెద్ద అంబర్ పేట వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తామని పేర్కొంది.
అంతేకాదు మెట్రో కారిడార్ను తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు ఎనిమిది కిలోమీటర్లు మేడ్చల్ నుంచి పటాన్ చెరు వరకు 29 కిలోమీటర్లు ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు పొడిగించాలని నిర్ణయించింది. అలాగే రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైల్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ పనులన్నిటికీ నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా ప్రస్తుతం పనులు టెండర్ల దశలో ఉన్నాయి.
అయితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్రేకులు వేయాలని భావిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ మెట్రో విస్తరణ ప్రాజెక్టు పైన కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశమైన రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులపై వారితో చర్చించిన క్రమంలో ఓఆర్ఆర్ మెట్రో విస్తరణ ప్రాజెక్టు పైన కూడా చర్చించారు.
ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో విస్తరణ చేయాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లబ్ధి చేకూర్చడం కోసం తీసుకున్న నిర్ణయమని ఆయన పేర్కొన్నారు అయితే ఆ ప్రాజెక్టును రద్దు చేసి పాత బస్తీని విమానాశ్రయానికి అనుసంధానం చేయాలని ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా సమాచారం.
పెండింగ్లో ఉన్న జేబీఎస్ ఫలక్ నుమా కారిడార్ ను పూర్తి చేయాలని, పహాడీ షరీఫ్ మీదుగా విమానాశ్రయం వరకు మెట్రోను పొడిగించాలని భావిస్తున్నారు. ఒకవేళ ఇలా కనుక నిర్మాణం జరిపితే పాతబస్తీ కూడా కవర్ అవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.












Click it and Unblock the Notifications