పాడి కౌశిక్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: హరీష్ రావు డిమాండ్!
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి చీర, గాజులు పంపిస్తున్నానని చేసిన వ్యాఖ్యలతో మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య చోటుచేసుకున్న సవాళ్ల పర్వం ఉద్రిక్తతకు కారణమైంది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అనుచరులను వెంటబెట్టుకొని వెళ్లిన అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ధర్నా చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి.. హరీష్ రావు ఫైర్
కౌశిక్ రెడ్డి ఇంటి పైన కోడిగుడ్లు, టమాటాలతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం, అరికపూడి గాంధీ అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతినివ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి ఘటనలతో అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన పైన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇదేం ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రశ్న
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే తమ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి జరిగిందని బిఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఈ దాడిని తమ తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ఈ మేరకు ట్వీట్ చేసిన హరీష్ రావు ఇదేం ప్రజాస్వామ్యం.. ఇదేం ప్రజా పాలన.. ఇదేం ఇందిరమ్మ రాజ్యం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
రాళ్లు, గుడ్లు, టమాటాలతో దాడి చేయడం హేయమైన చర్య
తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంతోపాటు వారిని ఉసిగొల్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపైన దాడులు చేయించడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అరికెపూడి గాంధీ మందీమార్బలంతో వెళ్లి కౌశిక్ రెడ్డి మీద రాళ్లు, గుడ్లు, టమాటాలతో దాడి చేయడం హేయమైన చర్య అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు ప్రజా ప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్
అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేస్తానని ముందే చెప్పి అనుచరులతో వచ్చినప్పటికీ వారిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని హరీష్ రావు మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి పైన దాడి చేసిన గాంధీని అతని అనుచరులను అరెస్టు చేసి తక్షణం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్ పార్టీ విద్రోహ,వికృత, ప్రజాస్వామిక వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications