ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి; సీఎం హోదాలో తొలిసారి ప్రధాని మోడీతో భేటీ, ఉత్కంఠ!!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో వీరు ఢిల్లీకి బయలుదేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడానికి వీరికి అపాయింట్మెంట్ ఖరారు కావడంతో సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీకి పయనమయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల పైన రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.

ప్రధానంగా ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు విడుదల చేయాలని వీరు ప్రధాని మోడీని కోరనున్నారు. అంతేకాకుండా విభజన సమస్యలతో పాటు, పెండింగ్ ప్రాజెక్టులు వాటి అనుమతులపై కూడా రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అలాగే కెసిఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల పరిస్థితిపై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో ఈ సందర్భంగా చర్చించనున్నట్లు సమాచారం.
ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మరోసారి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి భేటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తుంది. అయితే రాజకీయంగా బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య పొసగని నేపథ్యంలో, రేవంత్ రెడ్డి విన్నపానికి నరేంద్ర మోడీ ఏ మేరకు స్పందిస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన తర్వాత, నేడు కాంగ్రెస్ హైకమాండ్ తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. త్వరలో రానున్న పార్లమెంటు ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులపై కూడా వారు హై కమాండ్ తో చర్చించనున్నారు. మొత్తానికి తొలిసారి రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ కావటం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications