తెలంగాణ స్పోర్ట్స్ పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మన యువత సత్తా చాటేలా తెలంగాణ క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ క్రీడా విధానంపై ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ శుక్రవారం సమీక్షించారు.
ఈ విధానంలో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Young India Physical Education and Sports University - YIPESU)కి సంబంధించిన బిల్లు సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని ఆదేశించారు.
మరో పది రోజుల్లోగా యంగ్ ఇండియా స్పోర్స్ట్ వర్సిటీకి సంబంధించిన గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

అత్యుత్తమ క్రీడా విధానం కోసం దక్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలన్నారు. ఈ రంగంలో నిపుణులు, క్రీడాకారులతో సంప్రదింపులు జరపాలని సీఎం రేవంత్ చెప్పారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు సంబంధించిన క్యాలెండర్‌ను వెంటనే తయారు చేయాలన్నారు సీఎం రేవంత్.
వచ్చే రెండేళ్లలో నేషనల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను సంప్రదించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర క్రీడల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరోవైపు, ABP Network మీడియా సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన 'ది సదరన్ రైజింగ్' సదస్సు (The Southern Rising Summit 2024)లో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రగతిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, రైజింగ్ తెలంగాణ (Rising Telangana), రైజింగ్ హైదరాబాద్ (Rising Hyderabad) లక్ష్యాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
పన్నుల వాటాల్లో దక్షిణాది రాష్ట్రాలకు హక్కుగా రావలసిన నిధుల విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశం ప్రగతిబాటలో పయనించడానికి అన్ని రాష్ట్రాలు సమంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications