రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఈ తేదీలోగా జరగాల్సిందే: సీఎం రేవంత్
రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై సోమవారం వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖా అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రూ. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్దం చేయాలన్నారు. పూర్తిస్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేసి తీరాల్సిందేని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్నిరూపొందించాలని సీఎం సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15లోగా పంట రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications