బయట తినాలంటేనే..: బిర్యానీలో బొద్దింక దర్శనం!
ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడిన విషయాలను గమనిస్తున్న ప్రజలు రెస్టారెంట్లు, హోటళ్లలో తినాలంటేనే జంకుతున్నారు. ఎంతో ఇష్టంగా తినే బిర్యానీని కూడా కుళ్లిన మాంసంతో చేస్తుండటంతో ఆహార ప్రియులు బయట తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిర్యానీలో కప్ప, పురుగులు, నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా నిత్యం కల్తీ ఆహారాలు బయటపడుతన్న విషయం తెలిసిందే.
తాజాగా, మరో హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం వెలుగుచూసింది. ఓ హోటల్ బిర్యానీలో బొద్దింక రావడంతో వినియోగదారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సికింద్రాబాద్ అల్వాల్ లోని యతి హౌస్ అనే హోటల్‌లో బిర్యానీ తినడానికి పలువురు వినియోగదారులు వెళ్లారు. అయితే, వారు తింటున్న బిర్యానీలో ఓ బొద్దింక ప్రత్యక్షమైంది.

ఈ క్రమంలో ఆ హోటల్ యాజమాన్యంపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఆహారంలో సరైన నాణ్యత లేకపోవడం, కిచెన్‌లో సరైన శుభ్రత లేకపోవడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు.
వంటగదిలోని ఫ్రిజ్‌లో జూజుపట్టిన ఆహార పదార్థాలను వినియోగదారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని తయారు చేసి, కస్టమర్లకు అందిస్తున్న హోటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి హోటళ్లలో ఆహారం తినాలంటేనే భయమేస్తోందన్నారు. ఇలాంటి హోటళ్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది ఇలావుండగా, గత శుక్రవారం కేపీహెచ్‌బీలోని నెక్సస్ మాల్ సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్‌లో అందించిన అల్పాహారంలో ఒక బొద్దింక కనిపించింది. దీంతో ఆ కస్టమర్ టిఫిన్ సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతేగాక, ఆ బొద్దింక ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తమకు వడ్డించిన చట్నీలో బొద్దింకలు కనిపించాయని పేర్నొన్నాడు. ఈ టిఫిన్ సెంటర్‌పై ఆహార భద్రతా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, గత కొద్ది వారాలుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తూ నాణ్యత, పరిశుభ్రతు పాటించిన వాటిపై చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications