Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Digu Digu Naga Song: అనంత శ్రీరామ్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్-భక్తి పాటను ఐటెం సాంగ్ చేస్తారా?

ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌‌ రాసిన 'దిగు దిగు దిగు నాగ' పాట తీవ్ర వివాదాస్పదమవుతోంది. జానపద భక్తి గేయాన్ని రక్తి గేయంగా మార్చేశారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రముఖ సినీ గేయ రచయిత బాధ్యత లేకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పాట రాయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పబ్లిసిటీ స్టంట్ కోసం హిందువులను టార్గెట్ చేస్తున్నారని... వారి మనోభావాలను కించపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గేయ రచయిత అనంత శ్రీరామ్‌పై పలు చోట్ల కేసులు కూడా నమోదవుతున్నాయి.

భక్తి పాటను ఐటెం సాంగ్ చేస్తారా..?

భక్తి పాటను ఐటెం సాంగ్ చేస్తారా..?

'వరుడు కావలెను' సినిమా కోసం అనంత శ్రీరామ్ రాసిన 'దిగు దిగు దిగు నాగ' పాటను వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించాలని నెల్లూరుకు చెందిన బీజేపీ మహిళా మార్చా అధ్యక్షురాలు బిందురెడ్డి డిమాండ్ చేశారు. అనంతశ్రీరామ్‌పై ఆమె చిల్లకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంత శ్రీరామ్‌తో పాటు ఆ చిత్ర బృందంపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే వివాదంపై ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో బిందురెడ్డి మాట్లాడారు.'ఇది జానపద గేయాన్ని కాపీ చేశారనే వివాదం కాదు. భగవంతుడి భక్తి గేయాలు.. సుబ్రహ్మణ్యస్వామి,అయ్యప్ప భజనల్లో పాడుకునే గేయాన్ని,నాగ దేవత పూజల్లో వాడే పాటను ఇలా ఐటెం సాంగ్‌గా చిత్రీకరిస్తారా.. ఆధ్యాత్మిక భజన సాంగ్‌ను రక్తి పాటగా మార్చడం సరికాదు. కొంటెనాగు.. ఈడు పొంగుతోంది.. లాంటి పదాలు వాడటం చాలా అభ్యంతరకరం.' అని బిందురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కావాలంటే బిచ్చం వేస్తాం...

కావాలంటే బిచ్చం వేస్తాం...

'హీరోయిన్లకు కురచ దుస్తులు వేసి పాటలను చిత్రీకరిస్తున్నారు. కేవలం వివాదాల ద్వారా పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. నైతిక విలువలతో కూడిన ధనార్జన చేయాలి గానీ ఇలా పబ్లిసిటీ చేసుకోవడమేంటి.డబ్బులే కావాలంటే హిందువులంతా మీకు బిచ్చం వేస్తారు. ఇటీవల 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' అనే మరో సినిమాలో భజ గోవిందం అనే పాటను అశ్లీలంగా చిత్రీకరించారు. ఇలాంటి పాటలు యువతీ యువకుల మీద ప్రభావం చూపుతాయి. యువత వాటిని భక్తి పాటలనే సంగతి మరిచిపోయి ఐటెం సాంగ్స్‌గా భావిస్తున్నారు.' అని బిందురెడ్డి పేర్కొన్నారు.

రచయితపై క్రిమినల్ కేసు పెట్టాలి...

రచయితపై క్రిమినల్ కేసు పెట్టాలి...

ఇదే వివాదంపై సనాతన ధర్మ పరిరక్ష సమితి అధ్యక్షుడు కిరణ్ కుమార్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ...'భక్తి ట్యూన్‌ను తీసుకుని ఉద్దేశపూర్వకంగా ధర్మాన్ని అవహేళన చేస్తూ పబ్లిసిటీ స్టంట్ కోసం ఇలా చేశారు. సినిమాలో ఈ పాటను భక్తి పాటగా పెట్టాలి లేదా మొత్తం పాటనే తీసేయాలి. రచయితతో పాటు చిత్ర యూనిట్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి. లేదంటే పబ్లిసిటీ కోసం ఇలాగే మరొకరు చేస్తారు. ఒకరి మీద క్రిమినల్ కేసు పెడితే మరొకరు ఇలా చేసేందుకు భయపడుతారు. గేయ రచయిత,దర్శకుడు,ప్రొడ్యూసర్‌లపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలి.' అని డిమాండ్ చేశారు. సంగీత దర్శకుడు బోలె శావలి మాట్లాడుతూ... ప్రముఖ సినీ గేయ రచయితలు ఒక మాతృక నుంచి పాటను తీసుకునే ముందు కచ్చితంగా దాని నేపథ్యం తెలుసుకుని రాయాలన్నారు. పాట రాసేటప్పుడే జాగ్రత్త తీసుకుంటే ఇంత వివాదం జరగదన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడం సరికాదన్నారు.

మరో సినిమా పాట వివాదం...

మరో సినిమా పాట వివాదం...

ఇటీవలి కాలంలో సినీ పాటలు వివాదాల్లో ఇరుక్కోవడం కామన్ అయిపోయింది.'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' అనే సినిమా టైటిల్ సాంగ్‌పై కూడా వివాదం చెలరేగుతోంది. ఆ పాటలో భజగోవిందం భజగోవిందం అనే భక్తి గీతానికి సంబంధించిన లైన్స్ వాడటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అశ్లీల చిత్రాలతో నిండిన ట్రైలర్‌లో ఆ పాటను వాడటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన పొరపాటు కాదని ఆ చిత్ర దర్శకుడు యుగంధర్ పేర్కొన్నారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఆ లిరిక్స్ తొలగించామన్నారు. తాను కూడా హిందువునేనని.. అందుకే అభ్యంతరాలు వ్యక్తమైన వెంటనే అన్ని యూట్యూబ్ చానెల్స్ నుంచి ఆ వీడియోను తొలగించామన్నారు.

ఇటీవల మంగ్లీ పాట వివాదాస్పదం...

ఇటీవల మంగ్లీ పాట వివాదాస్పదం...

ప్రముఖ గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి పాడిన 'మైసమ్మ' పాట కూడా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 'చెట్టు కింద కూసున్నవమ్మా చుట్టం లెక్క ఓ మైసమ్మా...', 'మోతెవరి' లాంటి పదాలపై కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఆ పదాలను తొలగించి కొత్త పాటను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే మంగ్లీ కింది స్థాయి నుంచి ఎదిగొచ్చిన ఓ బంజారా బిడ్డ కాబట్టే ఆమెను వివాదంలోకి లాగారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నడూ అమ్మవారికి బోనమెత్తనివాళ్లు కూడా మంగ్లీ పాడిన మైసమ్మ పాట అభ్యంతరం వ్యక్తం చేయడమేంటని పలువురు ప్రశ్నించారు. పాటలో ఆ లిరిక్స్ తొలగించడంతో ఎట్టకేలకు ఆ వివాదం సద్దుమణిగింది.

సుద్దాల పాటపై వివాదం...

సుద్దాల పాటపై వివాదం...

రెండు నెలల క్రితం ప్రముఖ సినీ గేయ రచయిత,జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ రాసిన 'సారంగదరియా' పాట విషయంలోనూ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. జానపద గేయాన్ని మార్చి రాసిన సుద్ధాల.. దాని ఒరిజినల్‌ను సేకరించిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. కోమలి అనే సింగర్‌ సుద్దాల అశోక్ తేజపై తీవ్ర విమర్శలు చేశారు. ఒరిజినల్ పాడిన తనకు సుద్దాల రాసిన పాటను పాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. నిజానికి ఆ పాటను ఆమెతోనే పాడించాలని తాము భావించామని... కానీ ఆమెకు వీలు కాక పాడలేదని సుద్దాల తెలిపారు. చివరకు దర్శకుడు శేఖర్ కమ్ముల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది.గతంలో ప్రజా వాగ్గేయకారుడు వంగపండు 'ఏం పిలడో ఎల్దామొస్తవా..' పాటను మగధీరలో వాడుకోవడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక పాట వివాదంలోకి ఎక్కుతూనే ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+