ఎన్నికల ఫలితాల రాత్రి ప్రగతి భవన్ నుండి కంప్యూటర్లు మాయం? వాటిలో ఏముంది?
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు పాలన సాగించిన కేసీఆర్ ఇటీవల అధికారాన్ని పోగొట్టుకొని ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఇక తెలంగాణలో పాలనాపకాలు చేపట్టిన కాంగ్రెస్ గతంలో కేసీఆర్ పరిపాలనలో జరిగిన వ్యవహారాలన్నింటిని ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువస్తుంది. వివిధ శాఖలలో వేల కోట్ల రూపాయల రుణాలు, లక్షల కోట్ల రూపాయల అప్పులు, ధరణి పోర్టల్ లో జరుగుతున్న అక్రమాలు, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో జరిగిన అవకతవకలు ఇలా షాక్ అయ్యే అంశాలు బయటకు వస్తున్నాయి.
ఇక తాజాగా మరొక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రగతి భవన్ నుండి నాలుగు కంప్యూటర్లు మాయమైనట్టు అధికారులు గుర్తించారు. ప్రగతి భవన్ నుండి ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు అర్ధరాత్రి ఓ వ్యక్తి నాలుగు కంప్యూటర్లను కారులో తీసుకువెళ్లినట్టు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రగతి భవన్లోకి వెళ్లి 4 కంప్యూటర్లను తీసుకొని ఓ వ్యక్తి డిసెంబరు మూడవ తేదీ అర్ధరాత్రి వెళ్ళినట్టు ప్రగతి భవన్ సీసీటీవీ ఫుటేజ్ లో బయటపడింది.

ప్రగతి భవన్లో నాలుగు కంప్యూటర్లు మాయం కావడంతో సీసీటీవీ ఫుటేజ్ చూసిన అధికారులు అర్ధరాత్రి అనుమానాస్పదంగా ఓ కారులో నాలుగు కంప్యూటర్లను తీసుకువెళ్లడాన్ని గుర్తించారు. అర్ధరాత్రి కేసీఆర్ ప్రగతిభవన్లోకి వచ్చింది ఎవరు? ఆ కారు ఎవరిది? తీసుకువెళ్లిన 4 కంప్యూటర్లు దేనికి సంబంధించినవి? అందులో ఉన్న డేటా ఏమిటి? అవి కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధించినవా? లేక ప్రభుత్వానికి సంబంధించినవా.. ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాదు ప్రగతిభవన్లో కొన్ని హార్డ్ డిస్క్ లు కూడా మాయమయ్యాయి అని గుర్తించారు. అసలు ప్రగతిభవన్లోకి కేసీఆర్ అనుమతి లేకుండా ఎవరు వచ్చే అవకాశం లేదు. అలాంటి సమయంలో కెసిఆర్ కు తెలిసే కంప్యూటర్లు మాయమైనట్టుగా చర్చ జరుగుతుంది. ప్రగతి భవన్ లో నుంచి కంప్యూటర్లు తీసుకు వెళుతుంటే సెక్యూరిటీ అధికారి ఏం చేస్తున్నాడు? ప్రగతి భవన్ లో పనిచేసిన అధికారులకు ఈ విషయం తెలియదా? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఏది ఏమైనప్పటికీ దీన్ని సీరియస్ గానే తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రగతి భవన్ లో నుంచి మాయమైన కంప్యూటర్ల వెనుక ఉన్న లోగుట్టు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కంప్యూటర్లు మాయమైన రోజు ఉన్న ప్రగతి భవన్ సెక్యూరిటీకి నోటీసులు ఇచ్చి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications