తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళ రగడ: కర్షకుడా.. కదిలిరా అంటూ కాంగ్రెస్; బీజేపీకి పోటీగా..ఎవరి తిప్పలు వారివే !!
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. నువ్వా నేనా అన్నట్టు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడమే కాకుండా, భౌతిక దాడులకు పాల్పడుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు అంశంపై రైతుల పక్షాన పోరాటం చేసి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే, బీజేపీ కంటే వెనుక బడిన కాంగ్రెస్ రైతుల కోసం కాంగ్రెస్ అంటూ ధాన్యం కొనుగోళ్ళపై సర్కార్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది.

ధాన్యం కొనుగోళ్ళ చుట్టూ తిరుగుతున్న తెలంగాణా రాజకీయాలు
యాసంగిలో వరి సాగు చెయ్యొద్దు అని అధికార టీఆర్ఎస్ చెప్పడంతో మొదలైన రగడ, వర్షాకాలంలో ధాన్యం కొనుగోలు చేయటం లేదని, యాసంగిలో వరి సాగు చేసుకోవచ్చని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో మొదలైంది. ఇక ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని మధ్యలోకి లాగి, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అందుకే వరిసాగు చెయ్యొద్దని చెబుతున్నామని టిఆర్ఎస్ ప్రభుత్వం బిజెపిని ఇరికించే ప్రయత్నం చేస్తుంది . బిజెపి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని, కావాలని కేంద్రం పై దుష్ప్రచారం చేస్తున్నారని ఎదురు దాడి మొదలు పెట్టింది. ఇక ఈ వ్యవహారం రాజకీయ రగడ కాగా తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా మైలేజ్ కోసం రంగంలోకి దిగింది.

బీజేపీ, టీఆర్ఎస్ లను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ఆందోళన
రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ అటు బిజెపి ని, ఇటు రాష్ట్రంలోని టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పై రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేపట్టాలంటూ ఆందోళన చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఆధ్వర్యంలో గురువారం పబ్లిక్ గార్డెన్ నుండి బషీర్ బాగ్ కొని వ్యవసాయ శాఖ కమిషనరేట్ వరకు ఇప్పుడే కదిలిరా పేరుతో రైతులతో ప్రదర్శన నిర్వహించనుంది.

కర్షకుడా కదిలిరా ... కాంగ్రెస్ పార్టీ రైతు పోరాటం
రైతుల సమస్యల కోసం పోరాటం చేసి, రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలవాలని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్షకుడా కదలిరా అంటూ రైతులతో నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే తాజా పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు టిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఉప ఎన్నికల ఓటమి నుండి దృష్టి మరల్చటం కోసం కొత్త డ్రామాలకు తెరతీసింది అని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రైతులు పండించిన పంటను కేంద్రం కొనలేమని చెప్పడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని నిప్పులు చెరుగుతున్నారు.

ధాన్యం కొనుగోలుపై రెండు ప్రభుత్వాలను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి
రాజకీయ లబ్ధి కోసం ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజులని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇక ధనిక రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయదా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు . ధాన్యం కొనుగోలు చెయ్యాలని టీఆర్ఎస్ చేసిన ధర్నాలలో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి రేవంత్ మెలిక పెడుతున్నారు. అటు బిజెపి ప్రభుత్వాన్ని, ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ రెండింటినీ టార్గెట్ చేస్తూ రైతుల పక్షాన పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎవరి తిప్పలు వారివే.. తెలంగాణా రాజకీయాలపై పెదవి విరుస్తున్న జనం
ఈ క్రమంలోనే గురువారం నాడు కర్షకుడా కదిలిరా అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశం పై పోరాటం చేసి ఆ పోరాటాన్ని తమ సొంతం చేసుకోవాలని భావిస్తున్న బీజెపీ ని టార్గెట్ చేస్తూ, అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని రెండు ప్రభుత్వాలను తూర్పారబడుతూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. ధాన్యం కొనుగోళ్ళ విషయంలో రాజకీయ పార్టీల తీరు చూస్తున్న రైతులు, ప్రజలు ఎవరి తిప్పలు వారివే అంటూ తెలంగాణా రాజకీయాలపై పెదవి విరుస్తున్నారు. సమస్య ఎక్కడ ఉత్పన్నం అయ్యింది...పరిష్కారం ఏంటి అన్న ఆలోచన పక్కన పెట్టి ఈ విధంగా ఆందోళనలతో ఏం చెయ్యబోతున్నారు అన్న చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications