కార్నర్... జగన్ బాటలో రేవంత్, కాంగ్రెస్!: బాబు వ్యూహంతో కేసీఆర్ షాకిచ్చేనా?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారా? అంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన కాంగ్రెస్, టిడిపి ప్రశ్నించింది.
దీంతో శనివారం నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది, టిడిపికి చెందిన ఇద్దరి పైన ఒకరోజు పాటు సస్పెన్షన్ వేటు వేశారు. అధికార పార్టీ తీరు పైన విపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే తాము అవిశ్వాస తీర్మానం పెడతామని హెచ్చరించాయి.

కేసీఆర్‌కు హెచ్చరికలు
కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు డీకే అరుణ, టిడిపి సభ్యులు రేవంత్ రెడ్డి కూడా అవిశ్వాస తీర్మాన హెచ్చరికలు చేశారు. అయితే, విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినా ఫలితం ఉండదని అంటున్నారు. ఎందుకంటే తెరాసకు మేజిక్ ఫిగర్ ఉండటంతో పాటు అధికారంలోకి వచ్చాక ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు కారు ఎక్కారు. ఈ నేపథ్యంలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినా ఫలితం ఉండదు.

అవిశ్వాసం ద్వారా..
అయితే, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టవచ్చుననేది విపక్షాల అభిప్రాయంగా చెబుతున్నారు.

విపక్షాలకు అస్త్రాలు లేవా?
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు విపక్షాలకు సరైన అస్త్రాలు లేవనే చెప్పవచ్చు. శనివారం నాడు ఫిరాయింపుల అంశాన్ని లేవనెత్తి, సస్పెన్షన్‌కు గురయ్యారు.

జగన్‌లా..
ఏపీ అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రభుత్వ ఫిరాయింపులను ఎండగట్టేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, టిడిపి కూడా అదే ఆలోచన చేసినట్లుగా కనిపించింది. అందుకే అవిశ్వాస తీర్మానం పెడతామని డీకే అరుణ, రేవంత్ రెడ్డిలు హెచ్చరికలు జారీ చేశారు.

జగన్ ఎత్తుకు బాబు పైఎత్తు
నాడు వైయస్ జగన్ ఫిరాయించిన ఎమ్మెల్యేలను కార్నర్ చేసేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారు. కానీ టిడిపి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తతో విప్ జారీ చేసే అవకాశం జగన్‌కు ఇవ్వలేదు. ఆ తర్వాత డివిజన్‌కు స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. వాయిస్ ఓటుతో అవిశ్వాసాన్ని ఓడించారు. వ్యూహాత్మక లోపం కారణంగా అవిశ్వాస తీర్మానం నెగ్గలేదు.

చంద్రబాబులా.. కేసీఆర్
అవిశ్వాస తీర్మానం సమయంలో టిడిపి ప్రభుత్వం జగన్ ఎత్తుకు పైఎత్తు వేసి ప్రతిపక్షాన్ని కార్నర్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆలోచన చేసినట్లుగా కనిపిస్తోంది. అయితే తమ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు.. కేసీఆర్ కూడా చంద్రబాబులా వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రతిపక్షాల ఎత్తును చిత్తు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications