కొత్త జిల్లాల ఏర్పాటు: మల్లు రవి ఫైర్, కేసీఆర్‌కు ఇబ్బందులు తెస్తుందా?
హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఏ ప్రాతిపదికన, ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారో ప్రకటించాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
కొత్త జిల్లాల ఏర్పాటులో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించారు. జిల్లాల ఏర్పాటు విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయడానికి ముందు కేసీఆర్, ప్రజాప్రతినిధులతో, అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలను తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, ఈ సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాట్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరువు నివారణ చర్యలపై సమీక్షించాలని కోరారు.

భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వనరులు, సాగునీటి అంశాలు, రవాణా వసతులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోని ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండేలా జిల్లాల ఏర్పాట్లు ఉండాలన్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో ఎలాంటి వివాదాలు లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా కేసీఆర్‌కు మల్లు రవి సూచించారు.
అమరవీరులకు ప్రభుత్వ ఉద్యోగాలు: సీఎం కేసీఆర్
ఇదిలా ఉంటే నగరంలోని ఎంసీహెచ్‌ఆర్డీలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి టీఆర్ఎస్ మంత్రులతో పాటు పది జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. సదస్సులో రాష్ట్ర అవతరణ వేడుకలు, జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై చర్చిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అమరులైన వీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో భూవివాదాల్ని పరిష్కరించి, భూమి రికార్డులను సరిచేయాలని కలెక్టర్లకు సీఎం సూచించారు.

ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అసైన్డ్ భూములు చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయని తెలిపారు. మళ్లీ వాటిని అసైన్డ్ దారులకు అప్పగించాలని లేదంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. 20-30 ఏళ్లు కాగితాల మీద ఉన్న భూముల రిజిస్ట్రేషన్ కోసం వస్తే ఇబ్బందులు వస్తున్నాయన్నారు.
దీనికి తక్షణమే పరిష్కారం కావాలని చెప్పారు. జూన్ 2 నుంచి 10 వరకు సాదా బైనామాల ద్వారా జరిగిన లావాదేవీల ప్రకారం భూములన్నింటినీ రిజిస్టర్ చేయాలని అధికారులను ఆదేశించారు. 2014 జూన్ 2 నాటికి సాదా బైనామాల మీద ఉన్న ఐదెకరాల్లోపు భూమిని ఉచితంగా రిజిస్టర్ చేసి పేరు మార్పులు చేయాలని సూచించారు.
8 రోజుల పాటు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వివరాలన్నింటినీ కంప్యూటర్‌లో అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించారు.
సీఎం కేసీఆర్‌పై జీవన్ రెడ్డి మండిపాటు
సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో శంకుస్థాపనలు తప్ప ఎక్కడా పునాదిరాయి పడలేదని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారని ప్రశ్నించారు. రూ. 5 లక్షలతో డబుల్‌బెడ్‌రూం ఇంటి నిర్మాణం సాధ్యం కాదన్నారు.












Click it and Unblock the Notifications