Rahul Gandhi: నవంబర్ 5న హైదరాబాద్ కు రాహుల్ గాంధీ, ఖర్గే..!
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నవంబర్ 5న తెలంగాణకు రానున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఓ ప్రకటన చేశారు. మంగళవారం వారిద్దరూ హైదరాబాద్ కు వస్తారని చెప్పారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు బోయినపల్లిలోని మహాత్మా గాంధీ ఐడియాలజీ సెంటర్లో మేధావులు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన పెద్దలతో రాహుల్, ఖర్గే భేటీ అవుతారని వివరించింది. తెలంగాణలో కుల గణన ఎలా చేయాలి.. ఆ తర్వాత ఏం చేయాలానేది చర్చించనున్నారు.
వివిధ సామాజిక వర్గాలకు చెందిన మేధావుల సూచనలు స్వీకరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక మేరకు ఖర్గే, రాహుల్ హైదరాబాద్ వస్తున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కులగణన విషయంలో రాహుల్‌గాంధీ కి ఉన్న చిత్తశుద్ధికి ఈ పర్యటనే సాక్ష్యమని అన్నారు. కుల గణన సర్వేలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భాగస్వామి కావాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శనివారం డీసీసీ మీటింగ్ లు ఏర్పాటు చేసి, కుల గణనపై అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయడం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. పీసీసీ ఆధ్వర్యంలో నవంబర్ 6 లేదా 7న అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. కుల గణనపై అన్ని పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని వివరించారు. పార్టీ ఎమ్మెల్యేలను, వివిధ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లను ఇంఛార్జీలుగా నియమిస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ ముందుకెళ్తుందని వివరించారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మహేశ్వర్ రెడ్డి తనకు మంచి మిత్రుడని గుర్తు చేశారు.
బీజేపీలో ఆయనకు తగిన గౌరవం దక్కడం లేదన్నారు. రైతు రుణ మాఫీ సందర్భంగా రాహుల్ గాంధీని తెలంగాణకు తీసుకొచ్చి బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అయితే చాలా మంది రైతులకు రుణ మాఫీ కాలేదు. దీంతో రాహుల్ గాంధీని తీసుకొస్తే వ్యతిరేకత వస్తుందని భావించి.. ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికీ కూడా రైతు రుణ మాఫీ పూర్తి చేయలేదు.. రాహుల్ గాంధీ రుణ మాఫీ పై మాట్లాడాలని బీజేపీ, బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications