అల్లు అర్జున్ పగటి వేషగాడు-సినిమాలు అడ్డుకుంటాం-కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్నింగ్..!
హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో హీరో అల్లు అర్జున్ కూ, తెలంగాణ ప్రభుత్వానికీ మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టు, అనంతరం రిమాండ్, బెయిల్ తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో వివాదం ముదిరింది. దీనికి కొనసాగింపుగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడంతో ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. అదే సమయంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగడంతో సీఎం రేవంత్ దాన్ని ఖండించారు. అయినా కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు.
అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ఇవాళ మరోసారి విచారణకు పిలిచారు. విచారణకు ఆయన కూడా హాజరయ్యారు. అదే సమయంలో నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఓ పగటి వేషగాడు అన్నారు. డబ్బుల కోసం ఎలాంటి సినిమాలైనా తీస్తారంటూ అల్లు అర్జున్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ సినిమాలను..కాంగ్రెస్ కార్యకర్తలే అడ్డుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అల్లు అర్జున్ పుష్ప2 సినిమా చూస్తున్న సమయంలో మహిళ చనిపోయిన విషయం పోలీసులు చెప్పారని, నరబలి అయింది కాబట్టి సినిమా హిట్ ఖాయమని.. అల్లు అర్జున్ అన్నది కూడా వాస్తవమని కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఇకనైనా పద్దతి మార్చుకోవాలని భూపతిరెడ్డి సూచించారు. ఇప్పటికే అల్లు అర్జున్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ నేతలకు సందేశాలు వెళ్లాయని ప్రచారం జరుగుతున్న వేళ భూపతిరెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications