తెలంగాణాకు కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో రేపే.. లక్ష్యం అదే; అందరిలోనూ ఆసక్తి
తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా వెళుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతును కూడగట్టడం కోసం తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ మేనిఫెస్టోను రేపు విడుదల చేయనుంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే.
రేపు కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో
పాంచ్ న్యాయ్ ,పచ్చీస్ గ్యారెంటీల పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. దీనిని రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.

మేనిఫెస్టో వివరించనున్న రేవంత్ రెడ్డి
గత అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు అధికారాన్ని కట్టబెట్టడంతో ఇప్పుడు మళ్లీ లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారో చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టోను రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేయనున్నారు అనేది రేపు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు.
మేనిఫెస్టోలో ఈ అంశాలకు పెద్దపీట
రేపు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టో విడుదల చేయనున్న నేపథ్యంలో మేనిఫెస్టో పైన అన్ని రాజకీయ పార్టీలలో ఆసక్తి నెలకొంది అయితే ఈ మేనిఫెస్టోలో రాష్ట్ర విభజన హామీలు, రహదారులు, రైల్వే లైన్లు, ప్రత్యేక కారిడార్లు తదితర అనేక అంశాలకు చోటు కల్పిస్తూ రూపొందించారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేయనున్నారో సీఎం రేవంత్ వివరించనున్నారు.
కాంగ్రెస్ ముఖ్యమైన హామీలివే
లోక్సభ ఎన్నికల కోసం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ముఖ్యమైన హామీల వివరాల్లోకి వెళితే మహిళలకు ఉద్యోగాలలో 50% రిజర్వేషన్లు, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం, రైతుల కోసం పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ,రైతుల రుణమాఫీ, వ్యవసాయ పరికరాల జిఎస్టి మినహాయింపు, రైల్వేల ప్రైవేటీకరణ రద్దు తదితర అంశాలున్నాయి.
యువతకు, సామాన్యులకు పెద్దపీట
బీహార్ తరహాలోనే దేశవ్యాప్తంగా కుల గణన, నిరుద్యోగులకు 30 లక్షల ఉద్యోగాలు, 5000 కోట్ల రూపాయలతో యువతకు స్టార్టప్ ఫండ్, నిరుద్యోగ భృతి ద్వారా జాబ్ లేని యువత ఖాతాల్లోకి నగదు బదిలీ, చిన్న తరహా పరిశ్రమల రుణాలను కొంత మాఫీ చేసి, తక్కువ వడ్డీకి రుణాలను ఇవ్వడం, విద్య రుణాల వడ్డీ రేటు తగ్గింపు, దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల పంపిణీ తదితర హామీలున్నాయి.












Click it and Unblock the Notifications