కాంగ్రెస్‌దే అధికారం, తెలంగాణ నుంచి 4గురు కేంద్రమంత్రులు: కేసీఆర్‌పై రేవంత్ సెటైర్లు
ఎగ్జిట్ పోల్స్ వెలువడిన వేళ.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తున్నామన్నారు. శనివారం మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణకు 4 కేంద్ర మంత్రి పదవులు వస్తాయని.. ఏ శాఖలు తీసుకోవాలని చర్చ చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
తెలంగాణలో బీజేపీకి 4-5 సీట్లు వస్తాయని జేపీ నడ్డా అన్నారని ఈ సందర్భంగా రేవంత్ చెప్పారు. ఈ సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకే రాని వాడు అసెంబ్లీకి వస్తాడా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో భిన్నాభిప్రాయాలు ఉన్నా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రాని ప్రతిపక్ష నేత ఒక నేతనా? అంటూ విమర్శించారు.

తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ చెప్పినట్టు సెక్రటేరియట్ బయట కాదు.. సెక్రటేరియట్ లోపలనే ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్. సెక్రటేరియట్ బయట తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు అంటూ ప్రశ్నించారు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించేందుకు బాధ్యతలు అప్పగించామన్నారు. కాకతీయ కళాతోరణం తొలగింపుపైనా సీఎం రేవంత్
రెడ్డి స్పందించారు.
కాకతీయ రాజులను సమ్మక్క సారలమ్మలను చంపిన రాజుగానే చూస్తామని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. ఎన్నికల నిబంధనల మేరకే ఆవిర్భావ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీ సందేశం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ లోగోలో అమరవీరుల స్థూపం ఉండొద్దా? అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. అమరవీరుల కుటుంబాలపైన కేసీఆర్ కుటుంబానికి అక్కసు అంటూ వ్యాఖ్యానించారు. కనీసం లోగోలో అమరవీరుల స్థూపం పెట్టిన సహించలేక పోతుందని ఎద్దేవా చేశారు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం.. కొత్త ప్రభుత్వ లోగోను ఒకేసారి ఆవిష్కరిస్తామన్నారు.
కేసీఆర్ పాకిస్తాన్ లాగా వ్యవహరిస్తున్నారని.. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఒకరోజు ముందు పాకిస్థాన్ ఉత్సవాలు చేస్తుందని అన్నారు. అలాగే కేసీఆర్ కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఒకరోజు ముందే వేడుకలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. పాకిస్థాన్‌కు, కేసీఆర్‌కు పెద్దగా తేడా లేదన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్‌కు వ్యాపారమని మండిపడ్డారు. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్‌పై ఎన్నికల కోడ్ ముగియగానే సమీక్ష నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ పోలీస్ అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపించారని.. అప్పుడు సీబీఐ విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నిచారు. కేసీఆర్‌ను బీజేపీ సెట్టింగ్ చేసుకోవడానికి సీబీఐ విచారణ కోరుతోందని రేవంత్ ఆరోపించారు. నయీమ్ ఆస్తులపై ఫిర్యాదు రాలేదని.. ఫిర్యాదు వస్తే విచారణ అధికారికి సిఫార్సు చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే కూలిందని.. మూడేళ్లు అధికారంలో ఉన్న ఎందుకు రిపేర్లు చేయలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్. ఇక, మే 27తో పీసీసీ పదవి కాలం ముగుస్తుందని.. పీసీసీగా సీనియర్ నేతకు పార్టీ అవకాశం ఇస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications