తెలంగాణాకు కూల్ న్యూస్.. రెండ్రోజుల పాటు వర్షాలు.. కానీ
తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు ఉక్కపోతతో అల్లాడిన జనం ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు తెల్లవారుజామున పలు జిల్లాలలో వర్షం కురిసింది. ఇక తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు తీసుకువచ్చింది. రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
నేడు, రేపు వర్షాలు
నేడు, రేపు రాష్ట్రంలో అనేక జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ, జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

వాతావరణంలో మార్పులు
ఇక రేపు కూడా పైన పేర్కొన్న జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు పైన పేర్కొన్న ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఇక రానున్న రెండు రోజులలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
రైతాంగం జాగ్రత్త
బలమైన గాలులతో కూడిన వర్షాలు ఉన్న నేపధ్యంలో రైతాంగం నష్ట నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఉద్యాన పంటలు అయిన మామిడి సాగు చేసే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక వర్షాలు లేకుండా ఉన్న జిల్లాలలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఎండలు మండే, ఈదురు గాలులు వీచే సమయంలో బయట తిరగడం మంచిది కాదని సూచించింది.
ఉత్తర తెలంగాణా జిల్లాలలో భగభగలు.. జాగ్రత్త
ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఎండ వేడి ఎక్కువగా ఉందని, వడదెబ్బకు గురి కాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచించింది.












Click it and Unblock the Notifications