రాష్ట్రంలో తొలిసారి: స్కైప్ ద్వారా భార్యాభర్తలకు విడాకులు
ఖమ్మం: భార్యాభర్తలు స్కైప్ ద్వారా విడాకులు పొందారు. భార్య అమెరికాలో, భర్త ఖమ్మంలో ఉంటారు. వారినిస్కైప్ అప్లికేషన్(యాప్) ద్వారా విచారణ జరిపి వారిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. శనివారం ఖమ్మం కోర్టులో ఈ తీర్పు వెలువడింది. వివరాల్లోకెళితే.
ఖమ్మం నగరానికి చెందిన నల్లపునేని కిరణ్‌కుమార్‌కు ఇదే నగరానికి చెందిన కేతినేని పావనికి 2012 మార్చి 9న వివాహమైంది. కాపురానికి రాకముందే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. వివాహాన్ని రద్దు చేయాలని కిరణ్‌కుమార్ 2012 జూన్ 8న ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.
తనను అధిక వరకట్నం కోసం వేధించారని కిరణ్‌కుమార్, అతని తల్లిదండ్రులపై పావని, హైదరాబాద్ 13వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో 2013లో కేసు దాఖలు చేశారు. ఇరుపక్షాల మధ్య మూడేళ్లుగా విచారణ సాగింది. ఖమ్మంలోని ప్రముఖుల సహాయంతో, న్యాయవాదుల చొరవతో ఇరుపక్షాలు రాజీకి వచ్చాయి.

ఇంతలో పావని అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తిచేసింది. అక్కడే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఆమె ఖమ్మం కోర్టుకు వచ్చి అంగీకారం తెలపడానికి సమయం లేకపోయింది. ఆమె తండ్రికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చింది. అయినా విడాకుల కేసులో ప్రతివాది నేరుగా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే, దేశంలోనే తొలిసారిగా ఇటీవల మద్రాసు రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు స్కైప్ ద్వారా ఒక కేసులో తీర్పునిచ్చారు. దీంతో అదే పద్ధతిలో ఈ కేసులోనూ విచారించాలని పావని తరపు న్యాయవాది కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
పిటీషన్‌ను ఆమోదించిన ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి మర్రిపాటి వెంకట రమణ శనివారం ఆమె సమ్మతిని స్కైప్ ద్వారా నమోదుచేసి విడాకులు మంజూరుచేశారు. నల్లపునేని కిరణ్‌కుమార్ తరపున న్యాయవాది కిలారు బాబ్జి వాదించగా కేతినేని పావని తరపున బత్తుల బసవ పున్నయ్య వాదించారు. కాగా, స్కైప్ ద్వారా కోర్టు తీర్పు వెలువడటం దేశంలో ఇది రెండోసారి కాగా, రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం విశేషం.












Click it and Unblock the Notifications