షాక్: గ్రామస్థులతో కలిసి అన్నావదినలను కాల్చేసి చంపేశారు
మంత్రాలు చేస్తున్నారనే అపోహతో దంపతులపై పెట్రోలు పోసి వారికి నిప్పంటించారు. దీంతో తీవ్రంగా గాయపడిన వాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మెదక్: తెలంగాణలోని మెదక్ జిల్లా దుబ్బాకలో ఘోరమైన సంఘటన జరిగింది. దుబ్బాక మండల కేంద్రంలో మంత్రాల నెపంతో భార్యాభర్తలపై అతడి సోదరుడు, మరి కొందరు కలిసి పెట్రోలు పోసి, నిప్పంటించారు. ఈ దుర్ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రస్తుతం కొన ఊపిరితో ఉన్న వీరిరువురిని దుబ్బాక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు.
దుబ్బాక మండల కేంద్రంలోని చెల్లాపూర్ రోడ్డులో ఉన్న మారెమ్మగడ్డ బీసీ కాలనీలో కడవేర్గు సుదర్శన్ (56), రాజేశ్వరి (52) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. కుమారుడు శ్రీధర్ ఇటీవలే చదువు పూర్తి కావడంతో స్థానికంగా ఉన్న ఓ బట్టల దుకాణంలో కూలీగా చేరాడు.
సుదర్శన్ తమ ఇంట్లోనే కిరాణాషాపు నడుపుకుంటుండగా, భార్య రాజేశ్వరి బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. సుదర్శన్ కుటుంబాన్ని కొద్ది రోజులుగా ఆయన సోదరులు శ్రీనివాస్, మల్లేశంతో పాటు కొందరు కాలనీవాసులతో కలిసి మంత్రాలు చేస్తున్నారని వేధిస్తు న్నారు. ఇదే క్రమం లో బుధవారం రాత్రి సుదర్శన్ దం పతులను, కుమారుడు శ్రీధర్, తల్లిగారింటికి వచ్చిన కూతురు రేణుకపై నిందితులు దాడి చేశారు.

శ్రీనివాస్, మల్లేశం, సుజాత, రాజు, బట్టు ఎల్లప్ప, బాలమణి, బాల్‌రాజు, గొడ్డుబర్ల లక్ష్మి తదితరులు కలిసి సుదర్శన్ కుటుంబసభ్యులపై దాడి చేసి, వారిని చితకబాదారు. దుబ్బాక విడిచి వెళ్లకపోతే చావు తప్పదని హెచ్చరించారు. దీంతో సుదర్శన్ కుటుంబం అదే రాత్రి దుబ్బాక పోలీసులను ఆశ్రయించింది.
ఆ సమయం రాత్రి కావడంతో గురువారం ఉదయం పిలిపిస్తామని చెప్పి, నచ్చజెప్పి పంపించారు. గురువారం ఉదయం మళ్లి సుదర్శన్ కుటుంబంపై దాడి జరిగింది. దీంతో తిరిగి బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. దాడికి పాల్పడిన వారిని కూడా పోలీసులు పిలిపించి, రాజీ కుదుర్చుకోవాలని హెచ్చరించి పంపించారు. ఇక తాము ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదనే ఉద్దేశంతో సుదర్శన్ కుటుంబం ఆటోలో సామానును సర్దుకుని, వెళ్లి పోయేందుకు సిద్ధమయ్యారు.
ఆ సమయంలో ఇంతకు ముందు దాడికి పాల్పడిన వారంతా ఒక్కసారిగా వీరిపై మళ్లీ దాడి చేసి, అందరినీ చితక బాదారు. సుదర్శన్‌ను, ఆయన భార్య రాజేశ్వరిని వారి ఇంటి ఎదుట ఉన్న స్తంభానికి కట్టేసి, పెట్రోలు పోసి, నిప్పంటించారు. పెట్రోలు మంటలకు తాళలేక దంపతులిరువురూ హాహాకారాలు చేసారు. ఎవరు కూడా వారిని కాపాడే ప్రయత్నం చేయలేదు ఈ సంఘటనను కొంత దూరం నుంచి గమనించిన వారెవరో 100 నంబర్‌కు ఫోన్ చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి, బాధితులను దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
జరిగిన సంఘటనపై నిందితుల వివరాలను బాధితులు సుదర్శన్, రాజేశ్వరి దంపతులు, వీరి కూతురు రేణుక, కుమారుడు శ్రీధర్‌ను విచారించారు. కేసు నమోదు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దుబ్బాక దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను సిద్దిపేట అదనపు సీపీ బాబూరావు, ఏసీపీ నర్సింహారెడ్డి పరిశీలించి, వివరాలు సేకరించారు. దుబ్బాక సివిల్ జడ్జి సంపత్ బాధితుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అర్థరాత్రి చికిత్స పొందుతూ రాజేశ్వరి మృతి చెందగా, ఉదయం భర్త సుదర్శన్ మృతి చెందాడు.

ఆస్తి తగాదాలే కారణమా...
ఆస్తి తగాదాలు తలెత్తడంతో తోడబుట్టిన అన్నపై తమ్ముళ్లు కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. తమ అన్నావదినలు మంత్రాలు చేస్తూ జనాలను పిచ్చివాళ్లను చేస్తున్నారని వీధి జనాలను నమ్మించారు. సుదర్శన్‌కు శ్రీనివాస్, మల్లేశ్ అనే ఇద్దరు తమ్ముళ్లున్నారు. కొన్నాళ్లుగా సుదర్శన్‌తో వీరికి ఆస్తి తగాదా నడుస్తోంది. ఇటీవల వీధిలోనే నివాసం ఉంటున్న చెల్లాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. బుధవారం సాయంత్రం స్థానిక కర్నాల చెలుక వద్ద అతడు చెట్టుకు ఉరేసుకునే ప్రయత్నం చేశాడు.
అన్న సుదర్శన్‌పై కక్షతీర్చుకునేందుకు శ్రీనివాస్, మల్లేశ్ ఈ ఘటనను ఆసరాగా చేసుకున్నారు. వ్యక్తి మతిస్థిమితం కోల్పోవడానికి తమ అన్న సుదర్శనే కారణమని గ్రామస్థులను నమ్మించారు. దాంతో గ్రామస్థులతో కలిసి అతి దారుణంగా సోదరులు అన్నావదినలను మృత్యుపాలు చేశారు.
సుదర్శన్, రాజేశ్వరీలను స్తంభానికి కట్టేసి మళ్లీ కొట్టారు. అనంతరం వారిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టారు. అడ్డుపడేందుకు వెళ్లిన కూతురు రేఖపైనా కిరోసిన్ చల్లారు. అయితే అమె తప్పించుకుంది.
ఈ సంఘటనను సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. భారత నాస్తిక సమాజం జిల్లా అధ్యక్షుడు పల్లెటూరు ప్రసాద్ దుబ్బాక ఎస్ఐతో మాట్లాడారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.












Click it and Unblock the Notifications