Konda Surekha: మంత్రి కొండా సురేఖకు షాక్.. నోటీసులిచ్చిన కోర్టు..!
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నాగార్జున కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం రికార్డు చేసింది. గురువారం ఈ కేసును విచారించిన కోర్టు మంత్రికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 23కు వాయిదా వేసింది. కొద్ది రోజుల క్రితం కొండ సురేఖ దుబ్బాకలో జరిగిన షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో స్థానిక ఎంపీ రఘునందన్ రావు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక చేనేత కార్మికుల తయారు చేసిన ఓ కండువా లాంటి దండను కొండా సురేఖకు వేశారు. ఈ ఫోటోను బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేశారు. అసభ్యకరంగా కామెంట్లు పెట్టారు. దీనిపై కొండా సురేఖ తీవ్ర మనస్థాపం చెందారు. కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమని అన్నారు. అలాగే కేటీఆర్ హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసినట్లు ఆరోపించారు.

కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై అక్కినేని నాగార్జునతో పాటు టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. దీంతో తన వ్యాఖ్యలపై ఆమె వివరణ ఇచ్చారు. కావాలని సమంత గురించి మాట్లాడలేదని.. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో ఇది జరిగిందని అన్నారు. సమంతకు క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ శాంతించని అక్కినేని నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించే మంత్రికి నోటీసులు వచ్చాయి.
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించారు. తనపై మంత్రి చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయని పిటిషన్ లో పేర్కొన్నారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications