తెలంగాణలో విలయం.. పారాహుషార్ - మాస్కు లేకుంటే రూ.1000 జరిమానా -కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు
తెలంగాణలోనూ కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి పేషెంట్లు హైదరాబాద్ కి క్యూ కడుతుండడం, జనాలు కరోనా జాగ్రత్తలు పాటించకపోవడంతో రోజూవారీ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహించే జనాలపై కొరడా ఝుళిపించేందుకు ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపై పబ్లిక్ ప్లేసుల్లో, వర్క్ ప్లేసుల్లో, ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పని సరిగా ధరించాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి గత కొన్నిరోజులుగా ఈ రూల్ విషయంలో చర్చ జరుగుతున్నప్పటికీ.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. మాస్క్ ధరించని వారికి వెయ్యి రూపాయిల ఫైన్ విధించక తప్పదని పేర్కొంటూ ఇవాళ(ఆదివారం) ఒక జీవో జారీ చేసింది.

అయితే కేవలం ఫైన్ తో సరిపెట్టకుండా.. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌యాక్ట్-2005 ప్రకారం, ఐపీసీ సెక్షన్ 188, 51- 60 ప్రకారం చట్టపరమైన చర్యలు కూడా తీసుకునేందుకు అధికారులకు అవకాశం ఉంటుందని పేర్కొంటూ తెలంగాణ సర్కార్ ఆ జీవోలో స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు అవసరమైన అధికారాలను ఇచ్చింది. జీవోను కచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఆ జీవో ద్వారా అధికారులను ఆదేశించారు. దీంతో ఈ జీవో ప్రకారం.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జరిమానాలు విధించడం మొదలైంది.
తెలంగాణలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,187 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనాతో చనిపోయారని బులిటెన్ రిలీజ్ అయ్యింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కొత్తగా 551 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటిదాకా తెలంగాణలో కరోనాతో 1,759 మంది మృతి చెందారు. ప్రస్తుతం 20,184 యాక్టివ్ కేసులున్నాయి. వీళ్లలో 13,366 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటారని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. మరోవైపు పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు దొరకడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్ పడకలు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతూ.. సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications