నటి డింపుల్ హయతిపై క్రిమినల్ కేసు: హయతి సంచలన ట్వీట్; రాహుల్ హెగ్డే ఏమన్నారంటే!!
ఖిలాడి, రామబాణం చిత్రాల హీరోయిన్ డింపుల్ హయతి వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును తన కారుతో ఢీకొట్టి, ఆపై కాలితో తన్ని హంగామా చేశారు. జర్నలిస్ట్ కాలనీ లో ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న నటి డింపుల్ హయాతి ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని పార్కింగ్ ప్లేస్ లో ఢీకొట్టారు.
డింపుల్ హయతి కాబోయే భర్త డేవిడ్ పార్కింగ్ ప్లేస్ లో ఉన్న రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని ఢీకొట్టారు. అదేంటి అని ప్రశ్నించిన డ్రైవర్ పై డింపుల్ హయతి మండిపడుతూ కార్ ని కాలితో తన్ని నానా రచ్చ చేశారు. దీంతో నటి డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్.

ట్రాఫిక్ డిసిపి డ్రైవర్ చేతన్ కుమార్ ఫిర్యాదు మేరకు నటి డింపుల్ హయతిపై 353, 341, 279 సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. డింపుల్ హయతి పై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసు పెట్టారు పోలీసులు. దీంతో ఆమెపై క్రిమినల్ కేసు నమోదైంది. గతంలోనూ వీరికి పార్కింగ్ విషయంలో వివాదం జరిగిందని, ఆమెకు ఎన్నిసార్లు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసిన తీరు మార్చుకోలేదని చెబుతున్న పోలీసులు కేసు పెట్టారు.
అయితే ఈ వివాదం పై స్పందించిన నటి డింపుల్ హయాతి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన తప్పులను ఆపలేరు.. కప్పిపుచ్చలేరని పేర్కొన్నారు. ఈ మేరకు డింపుల్ హయతి సంచలన ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే హీరోయిన్ డింపుల్ హయతితో వివాదంపై ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే స్పందించారు.
పార్కింగ్ విషయంలో ప్రతిసారి డ్రైవర్లతో ఆమె గొడవ పడుతూనే ఉన్నారని చెప్పారు. తనకు ఎన్నిసార్లు చెప్పినా తనలో మార్పు రావడం లేదని ఆయన పేర్కొన్నారు. తాజాగా బీఎండబ్ల్యూ కారు తో రివర్స్ లో వచ్చి తన వాహనాన్ని ఢీ కొట్టారని రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు చేశామని దర్యాప్తు చేసిన తర్వాత తప్పెవరిదో తేలుస్తారని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications