9 ద్వీపాల గుండా.. మొసళ్ల మధ్య ప్రయాణం.. హైదరాబాద్ నుంచి 60 కి. మీ. దూరంలోనే
నీటిలో మొసళ్లు.. ఒడ్డున పచ్చని చెట్ల నుంచి పక్షుల కిలకిలలు. ఇదో అద్భుతమైన జర్నీగా అనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి కేవలం 60 కి. మీ. దూరంలోనే ఉంది. దీంతో వారాంతాల్లో ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగి రావచ్చు. ఓ వైపు అడ్వెంచర్ జర్నీతో పాటు అహ్లాదకరమైన వాతావరణంలో హాయిగా విహరించవచ్చు. ఈ ప్రదేశమే మంజీరా అభయారణ్యం. ఈ మేరకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ పలు చర్యలు తీసుకుంటోంది.
మంజీరా అభయారణ్యం సంగారెడ్డి జిల్లాలో, మంజీరా వద్ద ఉంది. సంగారెడ్డి సింగూరు డ్యామ్‌ల మధ్య ఈ వైల్డ్ లైఫ్ శాంక్చరీ విస్తరించి ఉంది. ఈ అభయారణ్యం మొసళ్లకు ప్రత్యేకతగా నిలుస్తోంది. వాటికి రక్షణ కల్పించడమే కాక సుమారు 70 కంటే ఎక్కువ జాతుల పక్షులకు అలాగే అంతరించిపోతున్న మగ్గర్ మొసళ్లకు నిలయంగా ఉంది. ఈ అభయారణ్యం హైదరాబాద్ కు అతి దగ్గరలోనే ఉండటంతో ఈ అందాలను చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. పర్యటకుల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ నుంచి ఈ ప్రదేశానికి కేవలం గంటలోనే చేరుకోవచ్చు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మంజీరా డ్యామ్ ఉండగా.. అదే జిల్లా పుల్కల్ మండలంలో సింగూర్ డ్యామ్ ఉంది. ఈ రెండింటి మధ్య దూరం 20 కి. మీ. గా ఉంది. ఈ ప్రదేశం మొత్తం మంజీరా నది విస్తరించి ఉంది. మొసళ్లకు అనువైన ప్రదేశంగా ఉంది. నదీ పొడవునా విస్తరించి ఉన్న అభయారణ్యంలో 9 ద్వీపాలు ఉన్నాయి. ఏడాది పాటు ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉన్నందున ఈ ప్రదేశం ప్రకృతి రమణీయతను చాటుతుంది. ఇక్కడ సుమారు 4 వందల వరకు మొసళ్లు ఉంటాయి. ఈ ప్రదేశాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

మంజీరా అభయారణ్యం వద్ద కాటేజీలు నిర్మిస్తున్నారు. అలాగే 13 ఎకరాల్లో బోటింగ్ ప్లాజా నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి మొసళ్లను వీక్షించేందుకు అనుగుణంగా వాచ్ టవర్ నిర్మించనున్నారు. గైడ్ టూర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే మంజీరా డ్యామ్ నుంచి సింగూర్ డ్యామ్ కు మధ్య 20 కి. మీ. మధ్య క్రూయిజ్ షిప్ జర్నీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సింగూరు నుంచి మంజీరా వరకు ఈ షిప్ జర్నీ సాగనుంది.












Click it and Unblock the Notifications