వాటర్ బిల్లు పేరుతో లింక్.. జాగ్రత్త అంటున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్!
హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలోనే అమాయక నగరవాసులను మోసం చేయడానికి సైబర్ కేటుగాళ్లు మరో సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. 'హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు' అధికారుల పేరిట నకిలీ సందేశాలు, కాల్స్‌తో రంగంలోకి దిగారు.
వాటర్ మీటర్ రీడింగ్ పేరుతో సైబర్ నేరం
మీ వాటర్ మీటర్ రీడింగ్ ఇంకా అప్‌డేట్ కాలేదని, లేదా మీ CAN నంబర్ ధ్రువీకరణ పెండింగ్‌లో ఉందంటూ భయపెడుతున్నారు. ఒకవేళ వెంటనే స్పందించకపోతే మీ ఇంటి నీటి కనెక్షన్‌ను శాశ్వతంగా కట్ చేస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారు.ఈ క్రమంలో మోసగాళ్లు ప్రజలకు వాట్సాప్ లేదా సాధారణ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కొన్ని లింకులను పంపుతున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించుకోవడానికి కేవలం పది లేదా ఇరవై రూపాయలు మాత్రమే చెల్లించాలని నమ్మిస్తారు.

నకిలీ APK ఫైల్ తో నయా మోసం
ఇంత చిన్న మొత్తమే కదా అని బాధితులు ఆ లింకులపై క్లిక్ చేయగానే, ఒక నకిలీ APK ఫైల్ లేదా 'క్విక్ సపోర్ట్', 'ఎనీ డెస్క్' వంటి రిమోట్ యాక్సెస్ యాప్‌లు మొబైల్‌లో ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఈ మాల్వేర్ యాప్‌ల సహాయంతో హ్యాకర్లు బాధితుల ఫోన్ స్క్రీన్‌ను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుంటారు. ఆపై వీడియో కాల్స్ ద్వారా లేదా నిఘా వేసి బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలిస్తారు.
నగర వాసులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక
బాధితులు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు, యూపీఐ పిన్‌లు ఎంటర్ చేయగానే, వాటిని సేకరించి క్షణాల్లో ఖాతాలలోని సొమ్మునంతా ఊడ్చేస్తున్నారు. ఈ నయా సైబర్ మోసంపై హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు. వాటర్ బోర్డు పేరుతో వచ్చే ఎలాంటి అనధికారిక సందేశాలను, కాల్స్‌ను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. అపరిచితులు పంపే లింకుల ద్వారా ఎటువంటి థర్డ్-పార్టీ యాప్‌లను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేయకూడదని స్పష్టం చేశారు.
ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలన్న సీపీ సజ్జనార్
అలాగే బ్యాంక్ ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్/డెబిట్ కార్డ్ సీవీవీ (CVV) నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి మోసాల బారిన పడితే, వెంటనే మొబైల్ డేటాను ఆపేసి, ఆయా యాప్‌లను డిలీట్ చేయాలని కోరారు. తక్షణమే తమ బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేసి, 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసి తమ సొమ్మును కాపాడుకోవచ్చని పోలీసులు వెల్లడించారు.













Click it and Unblock the Notifications