వామ్మో.. ఈఎంఐల పద్ధతిలో లంచం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మహిళా సీడీపీఓ
ఈఎంఐ పద్దతిలో లంచం తీసుకుంటున్న అధికారిణి తాజాగా ఏసీబీ అధికారులకు చిక్కారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దారోజు పద్మ రూ. 63 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పట్టణ పరిధిలోని అంగన్వాడీల్లో తనిఖీ రిపోర్ట్ నెగటివ్ గా ఇవ్వకుండా నెలకు రూ. 1000 ఇచ్చేలా మెట్ పల్లి అర్బన్ మండలంలోని 21 అంగన్వాడీ కేంద్రాలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో 3 నెలల మొత్తం రూ. 63 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా లబ్ధి పొందేందుకు యత్నించినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నిందితురాలిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. ఇక ఒక ప్రభుత్వ అధికారిణి ఇలా నెలవారీ పద్ధతిలో లంచం వసూలు చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మెట్ పల్లి చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దారోజు పద్మ ఎక్కడా లేని విధంగా ఈఎంఐ పద్ధతిలో లంచం తీసుకోవడం ప్రారంభించారు. మెట్ పల్లి పరిధిలోని 21 అంగన్వాడీ సెంటర్లను నిరంతరం తనిఖీ చేస్తుంటారు. అయితే ఈ కేంద్రాలను తనిఖీ చేసే సమయంలో రికార్డుల్లో ఎలాంటి రిమార్క్స్ రాయకుండా ఉండేందుకు, ఒక్కో సెంటర్ నుంచి నెలకు రూ.1,000 చొప్పున ఇవ్వాలని సీడీపీఓ పద్మ వారిని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మొత్తం 21 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి గత మూడు నెలల బకాయిల కింద ప్రతి కేంద్రానికి రూ. 3 వేల చొప్పున మొత్తం రూ. 63 వేలు చెల్లించాలని షరతు పెట్టారు. అయితే లంచం ఇచ్చేందుకు నిరాకరించిన ఫిర్యాదుదారులు నేరుగా కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

అయితే పథకం ప్రకారం శనివారం మధ్యాహ్నం మెట్ పల్లిలోని సీడీపీఓ ఆఫీస్ బయట అధికారిణి పద్మ నేరుగా లంచం తీసుకుంటుండగా ఏసీబీ బృందం దాడి చేసింది. ఆమె వద్ద నుంచి రసాయనాలు పూసిన లంచం నగదును స్వాధీనం చేసుకుంది. ఇక ఆమెను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కరీంనగర్ లోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా వివరాలను గోప్యంగా ఉంచినట్లు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications
