విశాఖ ఉక్కు పై నిర్ణయం మారలేదు - కేంద్రం అనూహ్య ట్విస్ట్..!!
ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు కేంద్రం.. ఇటు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కు పరిష్కారం లభించిందని అంతా భావించారు. కొద్ది నెలల క్రితం కేంద్రం రూ 11,440 కోట్లు ప్లాంట్ కోసం కేటాయించారు. కేంద్రం ఈ నిధుల ప్రకటన ద్వారా ఇక ప్రయివేటీకరణ ఉండదని ముఖ్య నేతలు చెబుతూ వచ్చారు. ఇక, తాజాగా డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజిమెంట్ (దీపం) విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్ పైన అనూహ్య ట్విస్ట్ ఇస్తూ రాసిన లేఖ సంచలనంగా మారుతోంది.
కేంద్రం తాజా నిర్ణయం
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం నిర్ణయం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ లో పెట్టబడుల ఉప సంహరణ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు మరోసారి తేల్చింది. దీంతో, విశాఖ ఉక్కును నూటికి నూరు శాతం అమ్మేయాలనుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో మార్పు లేదని స్పష్టత ఇచ్చింది. కొద్ది నెలల క్రితం స్టీల్ ప్లాంట్ ను ఆర్దిక ఇబ్బందుల నుంచి బయట పడేసేందుకు కేంద్రం ఆర్దిక ప్యాకేజీ ప్రకటించింది. రూ 11,440 కోట్లు ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తీసుకొస్తా మని కేంద్ర మంత్రులు కుమార స్వామి, శ్రీనివాస వర్మ చెప్పకొచ్చారు. ఇదే సమయంలో ప్లాంట్ లో కార్మికుల సంఖ్య ను తగ్గించటం పైనా చర్చ జరుగుతోంది.
నిర్ణయం మారలేదు
ఉద్యోగులను వీఆర్ఎస్ ఇచ్చి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఉండదని కూటమి నేతలు చెబుతున్నా.. పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా కార్మిక నాయకుడు పాడి త్రినాధరావు.. నాలుగేళ్ల క్రితం కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్ (సిసిఇఎ) వంద శాతం వ్యూహాత్మక అమ్మకం చేస్తామని స్టీల్‌ప్లాంట్‌పై నిర్ణయం చేసిందని, తాజా పరిస్థితి ఏమిటని..వివరణ కోరారు. అప్పటి నిర్ణయంలో ఏ మార్పు ఇంతవరకూ జరగలేదని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అజరు నాగ్‌పాల్ నుంచి సమాధానం వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజి ట్ (దీపం) నుంచి వచ్చిన లేఖ ఇప్పుడు మరో సారి ఆందోళనకు కారణమవుతోంది.

కార్మికుల్లో కొత్త ఆందోళన
కేంద్రం ప్యాకేజీ ప్రకటించిన తరువాత ఇక ప్రయివేటీకరణ అనేది ఉత్పన్నం కాదని కూటమి లోని ముఖ్య నేతలు చెప్పుకొచ్చారు. అయితే, కార్మిక సంఘాల నేతలు మాత్రం బ్యాంకులకు స్టీల్ ప్లాంట్ అప్పులను తీర్చడానికి, పన్నులు కట్టడానికేనని వాదించారు. అయినా, కూటమి నేతలు మాత్రం ఇక స్టీల్ ప్లాంట్ కు ఇబ్బంది లేదని.. ఉత్పత్తి పెంపు పైన ఫోకస్ చేయాలని సూచించారు. ఇప్పుడు కాంట్రాక్టు కార్మికులను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. తాజా లేఖతో విశాఖ ఉక్కుకు సంబంధించి 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకే కేంద్రం కట్టుబడి ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పుడు కేంద్రం నుంచి కార్మిక సంఘం నేతకు రాసిన లేఖ పైన కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇక, కూటమి నేతలు ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications