ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం- ముత్తా సహా వారికి ఊరట..!!
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న అయిదు మందికి ట్రయల్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదివరకు ఈ కేసును విచారణ కొనసాగిస్తోన్న కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ వారిపై ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఛార్జ్‌షీట్‌లో మొత్తం ఏడుమంది పేర్లను నమోదు చేసింది.
బోయిన్‌పల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ సహా మరో అయిదుమంది పేర్లు ఇందులో ఉన్నాయి. ఆ అయిదుమందిలో అరుణ్ ఆర్ పిళ్లై, ముత్తా గౌతమ్, వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు, ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అధికారులు కుల్‌దీప్ సింగ్, నరేందర్ సింగ్ ఉన్నారు. ఈ ఏడుమందిపైనా అప్పట్లో సీబీఐ అధికారులు కేసు ఫైల్ చేశారు.

ఈ కేసులో ఇవ్వాళ తాజాగా ఢిల్లీ ట్రయల్ కోర్టు అయిదుమందికి మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. అరుణ్ ఆర్ పిళ్లై, ముత్తా గౌతమ్, వ్యాపారవేత్త సమీర్ మహేంద్రు, ఢిల్లీ ఎక్సైజ్ శాఖ అధికారులు కుల్‌దీప్ సింగ్, నరేందర్ సింగ్‌లకు ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ మధ్యంతర బెయిల్ పేపర్లు అందిన తరువాత వారంతా విడుదల కానున్నారు. కాగా బోయిన్ పల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ విచారణను ఎదుర్కొంటోన్నారు.
కోట్ల రూపాయల మేర చేతులు మారినట్లు సమాచారం అందిన నేపథ్యంలో- ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా జోక్యం చేసుకున్నారు. ఆర్థిక నేరాలను నివారించడానికి ఏర్పాటైన ఈ దర్యాప్తు సంస్థ- తాజాగా బోయిన్‌పల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్‌ను అప్పట్లో అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ విధానం రూపకల్పనలో- హైదరాబాద్‌కు చెందిన బోయిన్‌పల్లి అభిషేక్ దక్షిణాదికి చెందిన లిక్కర్ బరూన్‌తో లాబీయింగ్ నిర్వహించారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు.
ఈ విషయాన్ని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ ఎం కే నాగ్‌పాల్ సమక్షంలో ఛార్జ్‌షీట్‌ను రూపొందించింది. విజయ్ నాయర్.. మాజీ ఈవెంట్ మేనేజర్. గతంలో ఆయన ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పని చేశారు. అనంతరం ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతో అసోసియేట్ అయ్యారు. ఆ పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
ఇదివరకు ఇదే కేసులో ప్రముఖ లిక్కర్ కంపెనీ ఇండోస్పిరిట్ ప్రమోటర్ సమీర్ మహేంద్రు, జనరల్ మేనేజర్ పెర్నోడ్ రికర్డ్, బినోయ్ బాబు, అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్, ప్రమోటర్ పీ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. వారిలో తాజాగా సమీర్ మహేంద్రుకు బెయిల్ లభించింది. ఇదే కేసులో సీబీఐ అధికారులు- భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆమె స్టేట్ మెంట్ ను వారు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications