త్వరలోనే మరో 30 వేల ఉద్యోగాలు భర్తీ - డిప్యూటీ సీఎం భట్టి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత 56,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తయ్యిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలోనే మరో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, సామాజిక న్యాయం ప్రాముఖ్యతను గుర్తిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో తీపికబురు అందనుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం.. వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని.. రైతు సంక్షేమమే తమ ప్రధాన అజెండా పేర్కొన్నారు. రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 69.70 లక్షల మంది రైతులకు చెందిన 1.49 కోట్ల ఎకరాల సాగుభూమికి రూ.9,000 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశామన్నారు. కేవలం 9 రోజుల్లో పెట్టుబడి సాయం రూపంలో ఇంత భారీ మొత్తం అందించామని వెల్లడించారు.

ఇక ఉగాది పండుగ నుంచి ప్రారంభమైన ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకంతో రాష్ట్రంలోని 3.10 కోట్ల మంది పేదలకు ఉపశమనం లభించిందని భట్టి వెల్లడించారు. దీనికోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.13,525 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. అంతే కాకుండా సన్నధాన్యాలు సాగు చేసిన రైతులకు ప్రోత్సాహకంగా క్వింటాకు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రూ.1,199 కోట్లను తమ ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.
రైతులకు అండగా..
రైతు అనుకోని విధంగా మృతి చెందితే.. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని భట్టి చెప్పారు. ఇప్పటి వరకు 42.16 లక్షల మంది రైతులకు బీమా సదుపాయం కల్పించామని తెలిపారు. ఇది కేవలం ఆర్థిక భరోసానే కాదని.. రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను కూడా తెలియజేస్తుందన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు..
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో తాజా బడ్జెట్‌లో రూ.23,373 కోట్లు కేటాయించామని చెప్పారు. సాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్..
మరోవైపు పేద కుటుంబాల పిల్లలకూ ప్రపంచ స్థాయి విద్య అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని భట్టి వివరించారు. ప్రతి పాఠశాలను 25 ఎకరాల్లో, రూ.200 కోట్లతో నిర్మించనున్నట్టు స్పష్టం చేశారు. మొదటి దశలో 58 స్కూల్స్ కోసం రూ.11,600 కోట్లు కేటాయించామని చెప్పారు. ఇది విద్య రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications