బ్లడ్ మాఫియాపై భగ్గుమన్న బాధిత కుటుంబాలు.. పరారీలో నిందితుడు (పిక్చర్స్)
హైదరాబాద్ : నగరంలో వెలుగుచూసిన కల్తీ రక్తం దందాలో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆసుపత్రి అడ్డాగా జరుగుతున్న ఈ దందాలో లోతుగా విచారించిన కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అరకొరా వసతులతో రోగుల సహనాన్ని పరీక్షించే ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో సామాన్య ప్రజలు ప్రభుత్వాసుపత్రి మాటెత్తాలంటేనే భయపడుతున్నారు.
ఇదిలా ఉంటే.. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సుల్తాన్‌బజార్ పోలీసులు ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆసుపత్రికి నోటీసులు జారీ చేశారు. సరైన పరీక్షలేవి చేయకుండానే నకిలీ రక్తాన్ని రోగులకు ఎక్కించి ప్రజల ఆరోగ్యంతో చెలగాడమాడుతున్నారంటూ ఆసుపత్రిలో రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.
ల్యాబ్ టెక్నీషియన్ నరేంద్ర ప్రసాద్ తెరలేపిన ఈ దందాలో కల్తీ చేసిన బ్లడ్ ప్యాకెట్లకు ప్రముఖ బ్లడ్ బ్యాంకుల లేబుల్స్ ను అతికించి, వాటినే రోగులకు ఎక్కించడం పట్ల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఆసుపత్రికి తరుచుగా బ్లడ్ ప్యాకెట్లను అందించే ఓ స్వచ్చంద సంస్థ ఆసుపత్రిలో రోగులకు విక్రయిస్తున్న బ్లడ్ యూనిట్లను పరిశీలించి రక్తంలో కల్తీ జరిగినట్టుగా నిర్దారించింది.
కల్తీలో భాగంగా దాదాపు మూడు, నాలుగు యూనిట్ల బ్లడ్ లో ఎవరికీ అనుమానం రాకుండా సెలైన్ ను కలిపి, ఆసుపత్రిలో రక్తం అవసరమున్న రోగులకు విక్రయిస్తున్నట్టుగా సమాచారం. జ్వరం కారణంగా ఆసుపత్రికి రాని నరేంద్ర ప్రసాద్ స్థానంలో ఇతర సిబ్బంధి విధులకు హాజరవడంతో కల్తీ రక్తం దందా బయటపడిన విషయం తెలిసిందే.
ఆసుపత్రి వివరాలను పరిశీలిస్తే.. ఇక్కడ 180 పడకలుండగా, దాదాపు 300 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
నిత్యం 3 నుంచి 4 ఆపరేషన్లు జరిగే ఈ ఆసుపత్రిలో, వైద్యుల అభ్యంతరం మేరకు నగరంలోని ఆరు ప్రముఖ బ్లడ్ బ్యాంకుల నుంచి బ్లడ్ యూనిట్లను సరఫరా చేస్తున్నారు. మొత్తంగా ఒక నెలలో ఆరు బ్లడ్ బ్యాంకుల నుండి ఆరువందల బ్లడ్ యూనిట్లను సరఫరా చేస్తున్నట్టుగా అంచనా.
ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నకిలీ బ్లడ్ మాఫియాపై పోలీసులు, వేర్వేరుగా విచారణ కొనసాగిస్తున్నారు. బ్లడ్ మాఫియాకు తెరలేపిన నరేంద్ర ప్రసాద్ పరారీలో ఉండడంతో అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
కాగా.. బ్లడ్ మాఫియా దురాగతాల వల్లే తమవాళ్లు మృతి చెందారంటూ మృతుల తరుపు బంధువులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నెల 13వ తేదీన ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఇబ్రహీంపట్నంకు చెందిన మేఘమాల అనే గర్భిణి, పద్నాలుగో తేదీన మృతి చెందింది. దీంతో నకిలీ రక్తం ఎక్కించటం వల్లే మేఘమాల మృతి చెందిందంటూ కుటుంబీకులు శుక్రవారం ప్రసూతి ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

బ్లడ్ మాఫియాపై భగ్గుమన్న బాధిత కుటుంబాలు.. పరారీలో నిందితుడు (పిక్చర్స్)
దీనిపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నకుమారి ఆసుపత్రిలో బ్లడ్ మాఫియా భాగోతంపై విచారణ చేపట్టాలని కోరుతూ సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ పి. శివశంకర్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతోపరారీలో ఉన్న నిందితుడు నరేంద్రప్రసాద్ పై సెక్షన్ 420, కాపీరైట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా ఎస్‌ఐ రామకృష్ణ తెలియజేశారు.

బ్లడ్ మాఫియాపై భగ్గుమన్న బాధిత కుటుంబాలు.. పరారీలో నిందితుడు (పిక్చర్స్)
పసిపాపతో ఆసుపత్రి ముందు ధర్నాకు దిగిన నకిలీ రక్తం బాధితులు. ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీలకు, బాలింతలకు కూడా నకిలీ రక్తం ఎక్కిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

బ్లడ్ మాఫియాపై భగ్గుమన్న బాధిత కుటుంబాలు.. పరారీలో నిందితుడు (పిక్చర్స్)
ఆసుపత్రి ముందు బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన. బ్లడ్ మాఫియా భాగోతం వెలుగు చూడడంతో, ఆసుపత్రి వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధిత మహిళల కుటుంబ సభ్యులు.

బ్లడ్ మాఫియాపై భగ్గుమన్న బాధిత కుటుంబాలు.. పరారీలో నిందితుడు (పిక్చర్స్)
బ్లడ్ మాఫియా భాగోతం వెలుగు చూసిన కోఠి పరిధిలోని సుల్తాన్ బజార్ ప్రసూతి ఆసుపత్రి ఇదే. ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నందున బ్లడ్ మాఫియాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications