ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే రాలేదా? అయితే జాగ్రత్త.. కొత్త రకం క్రైం!
ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే మీరు డబ్బులు డ్రా చేసినప్పటికీ డబ్బులు రాకపోవడంతో ఏటీఎం మిషన్ పనిచేయడం లేదని వెళ్ళిపోతున్నారా? అయితే జాగ్రత్త మీ డబ్బులను చోరీచేసే కేటుగాళ్లు కొత్త పద్ధతిలో చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఇటువంటి కేటుగాళ్లు డబ్బులు చోరీలు చేయడానికి రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇక ఈ విషయం తాజాగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు, ఏటీఎం దొంగల కేసులో ప్రజలను అలర్ట్ చేశారు.
ఇనుప ప్లేట్లు అమర్చి ఏటీఎంలలో డబ్బులు చోరీ
వరంగల్ కమిషనరేట్ పోలీసులు చేదించిన ఈ కేసు వివరాల్లోకి వెళితే ఏటీఎం మిషన్‌లలో డబ్బులు బయటకు రాకుండా ఇనుపప్లేట్లు అమర్చి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన అంతర్ రాష్ట్ర ముఠాను వరంగల్ సీసీఎస్, కాజీపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారివద్ద నుంచి రూ.5,10,000నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, ఐరన్ ప్లేట్లు, నకిలీ తాళంచెవులను స్వాధీనం చేసుకున్నారు.

సులభంగా డబ్బు సంపాదనకు ఏటీఎంలలో చోరీ
అరెస్టైన నిందితులు అల్వార్ జిల్లా, రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ఒకే ప్రాంతానికి చెందినవారిగా, పరస్పర పరిచయంతో కలిసి మద్యం సేవిస్తూ జల్సాలకు అలవాటు పడ్డారని పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏటీఎం చోరీలకు పాల్పడ్డారని వెల్లడించారు.
ఏటీఎం మిషన్లలో లోపాలు.. నకిలీ తాళంచెవులతో డబ్బు రాకుండా ఇనుప ప్లేట్లు
పెర్టో కంపెనీకి చెందిన పాత ఎస్‌బీఐ ఏటీఎం మిషన్లలో ఉన్న లోపాలను అధ్యయనం చేసిన ఈ ముఠా, నకిలీ తాళం చెవులతో ఏటీఎం తెరిచి డబ్బు బయటకు వచ్చే మార్గంలో ఇనుప ప్లేట్‌ను గమ్‌తో అమర్చేది. దీంతో ఖాతాదారుడు డబ్బు డ్రా చేసినా నగదు బయటకు రాక, మిషన్ లోపలే నిలిచిపోయేది. అనంతరం ఖాతాదారుడు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఏటీఎం తెరిచి నగదును చోరీ చేసేవారు.
దేశ వ్యాప్తంగా ఏటీఎంలలో చోరీలు చేస్తున్న ముఠా అరెస్ట్
ఈ తరహా చోరీలు దేశంలోని పలు రాష్ట్రాల్లో 40కి పైగా చేసినట్లు విచారణలో వెల్లడైంది. వరంగల్ ట్రైసిటీలో మాత్రమే 7 ఏటీఎం కేంద్రాల్లో రూ.12.10 లక్షల చోరీ జరిగింది. తాజా సమాచారం మేరకు కాజీపేటలో చోరీకి యత్నిస్తుండగా పోలీసులు నిందితులను నిఘా వేసి మరీ పట్టుకున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications