డీఎన్ఏ పరీక్ష చేయించుకో..: కిషన్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్
మూసీ ప్రక్షాళనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ బాధితుల పక్షాన పోరాటం చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారంనాడు బాధిత ప్రాంతాల్లో వారితో కలిసి నిద్రపోతున్నామని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతమైన అంబర్‌పేట తులసీనగర్‌లో బాధిత కుటుంబాలతో కలిసి రాత్రి బస చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన, ఆవేదనలో ఉన్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఎప్పుడు బుల్డోజర్‌తో ఇల్లు కూలగొడతారో అనే భయంతో ప్రజలు ఉన్నారన్నారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే బీజేపీ అనేక బస్తీల్లో రాత్రి బస చేస్తుందని తెలిపారు. మూసీ బాధితుల బాధ్యత తమ పార్టీ తీసుకుంటుందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుట్ర చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

ఇది ఇలావుండగా, కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి నువ్వు తెలంగాణ బిడ్డవేనా? ఒకసారి డీఎన్ఏ పరీక్ష చేసుకో అంటూ ఘాటుగా స్పందించారు. కిషన్ రెడ్డి పిలుపునిచ్చిన ఒకరోజు మూసీ నిద్ర కార్యక్రమంపైనా పొన్నం తీవ్రంగా స్పందించారు.
కేసీఆర్ డైరెక్షన్ మేరకే కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేస్తున్నారని విమర్శించిన పొన్నం ప్రభాకర్.. మూసీ నిద్ర కాదు.. మీ మొద్దు నిద్ర వీడాలని ఎద్దేవా చేశారు. మూసీ కాలువ వాసన చూసిన తర్వాతైనా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్కరూపాయి తీసుకొచ్చే శక్తి నీకు లేదని కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. కలెక్టర్ ను కొట్టిన వారిని సమర్థించిన నీవు కేంద్రమంత్రిగా అర్హుడివా అని పొన్నం ప్రశ్నించారు.
ఐఏఎస్ అధికారిపై దాడి జరిగితే ఖండించకుండా.. సమర్థిస్తారా? అని కిషన్ రెడ్డిపై మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. అధికారులపై దాడులు చేసినవారిని, వారి వెనుకున్న వారినీ వదిలేదని లేదని పొన్నం హెచ్చరించారు. హైడ్రా, మూసీ, అధికారులపై దాడి ఘటనపై అసలు బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications