అయ్యయ్యో.. ఆస్పత్రి ఆవరణలో నవజాత శిశువును పీక్కుతిన్న కుక్కలు!
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం 6 గంటలకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఎస్పీఎఫ్ ఆవరణలో ఒక నవజాత శిశువును కుక్కలు పీక్కుతిన్న ఘటన చోటుచేసుకుంది. ఎంజీఎం క్యాజువాలిటీ వార్డు పక్కనున్న ముళ్ళ పొదల్లోకి శిశువుని కుక్కలు ఈడ్చుకు వెళుతుండగా సెక్యూరిటీ చూసి వైద్యులకు సమాచారం ఇచ్చారు. కుక్కలు నవజాత శిశువు యొక్క బొడ్డు భాగంతో పాటు ఒకకాలు తినేశాయి.
ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో పసికందును కుక్కలు పీక్కు తిన్న ఘటన
అప్పటికే కుక్కలు సగం శరీరం తినేయడంతో శిశువు ఆడ శిశువా..మగ శిశువా అన్నది గుర్తుపట్టలేకపోయారు. ఈ ఘటన పైన పోలీసుల కేసు నమోదు చేసి కుక్కలు పసికందును ఎక్కడి నుంచి తీసుకువచ్చాయి అనే వివరాలను సేకరిస్తున్నారు. కాగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో చోటుచేసుకున్న నవజాత శిశువును కుక్కలు పీక్కు తిన్న ఘటనపై వరంగల్ కలెక్టర్ సత్య శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన విచారణకు ఆదేశించారు.

విచారిస్తున్న అధికారులు
డిసిపి స్థాయి అధికారులు ఈ ఘటన పైన ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. శిశువును కుక్కలు ఎక్కడ నుండి తీసుకు వచ్చాయి అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అన్నది విచారిస్తున్నారు.
నవజాత శిశువును కుక్కలు పీక్కు తిన్న ఘటనపై స్పందించిన ఎంజీఎం సూపరింటెండెంట్
ఇదిలా ఉంటే ఎంజీఎం ఆస్పత్రిలో కుక్కలు పసికందును పీక్కు తిన్న ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ స్పందించారు. ఎంజీఎం ఆసుపత్రిలో సహజ కాన్పులు జరగవని, ఈ వారం రోజుల్లో ఏ విధమైన కాంప్లికేటెడ్ సిజేరియన్ డెలివరీలు కూడా జరగలేదని, నవజాత శిశువుల ఐసీయులోనూ, వార్డులోనూ ఏ శిశువు కనిపించకుండా పోయినట్లుగా ఏ విధమైన ఫిర్యాదు అందలేదన్నారు.
బయట నుండి కుక్కలు తెచ్చినట్టు వెల్లడి
ఈ మృత శిశువు ఎంజీఎం చికిత్స నిమిత్తం వచ్చిన శిశువు కాదని నిర్ధారించుకున్నట్టుగా తెలిపారు. బయట ప్రదేశం నుండి కుక్కలు నోట కరుచుకొని వచ్చి ఉండవచ్చని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. సామాజిక మాధ్యమాలలో, మీడియాలో వస్తున్న వార్తలలో ఎంజీఎం ఆసుపత్రికి ఈ ఘటనను ఆపాదించకూడదని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.
ప్రజలకు విజ్ఞప్తి
ఎంజీఎం ఆసుపత్రిలో సురక్షితమైన పరిస్థితులలో, నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎవరు ఎంజీఎం ఆసుపత్రి పైన విశ్వాసాన్ని కోల్పోకూడదని మనవి చేస్తున్నామని ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ మురళి తెలిపారు.












Click it and Unblock the Notifications