నేనుండగా భయమెందుకు?: రంగం భవిష్యవాణిలో స్వర్ణలత ఏం చెప్పారంటే?
హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా సాగుతున్నాయి. బోనాల వేడుకల్లో సోమవారం కీలక ఘట్టం రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజల పూజలు సంతోషంగా అందుకున్నానని చెప్పారు. అయితే, గత ఏడాది మీరు ఇచ్చిన వాగ్ధానం మర్చిపోయారన్నారు.
కావాల్సిన బలాన్నిచ్చానని.. మీ వెంటా ఉంటానని స్వర్ణలత చెప్పారు. ఆలస్యమైనా వర్షాలు తప్పకుండా వస్తాయని.. భయపడొద్దని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరుగుతాయని.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వర్ణలత చెప్పారు. ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలన్నారు. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నట్లు తెలిపారు. తన వద్దకు వచ్చే ప్రజలను కాపాడే భారం తనదేనని అన్నారు.

రంగం కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రంగం భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి అనంతరం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అంబారీపై ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల కార్యక్రమం ఉంటుంది. ఇక సాయంత్రం పొట్టేళ్లతో పలహారం బండ్ల ఊరేగింపు ఉంటుంది.
కాగా, ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం కేసీఆర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనం సమర్పించారు. బీఆర్ఎఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా అమ్మవారికి నిన్న బోనం సమర్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.
మహంకాళి బోనాల్లో అపశృతి: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
మహంకాళి బోనాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి బోనాలకు వచ్చిన ఆకాశ్ సింగ్(27)అనే యువకుడు విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాన్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ సింగ్ బేగంబజార్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications