పవన్ .. మా రాజకీయాల్లో వేలు పెడతామంటే ఊరుకోం
"తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవంపై దాడి చేస్తూ మాపై ఆంధ్రా సంస్కృతిని రుద్దుతామంటే చూస్తూ ఊరుకోం. ఒకసారి మాతో పెట్టుకుంటేనే పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్లీ మా జోలికి వస్తే మూతి పళ్లు రాలుతాయి. మేము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలను పగలకొట్టి, మూటగట్టి ఆంధ్రాకే పార్సల్ పంపుతాం" అని బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అగ్రనేత కల్వకుంట్ల కవిత అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో సోమవారం జరిగిన 'తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు - సాధన' రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించిన కవిత.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న కుట్రలను సుదీర్ఘంగా ఎండగట్టారు.
ఉద్యమకారుల సభలో ఆంధ్రా నేతల గురించి మాట్లాడాల్సి రావడంపై కవిత స్పష్టతనిచ్చారు. "గత 60, 70 ఏళ్లుగా మన బిడ్డలను కోల్పోయాం. వంటావార్పు, సకల జనుల సమ్మె వంటి ఎన్నో కార్యక్రమాలతో ఎంతో పరిణతితో, పక్కవాళ్లను ఇబ్బంది పెట్టకుండా తెలంగాణ సాధించుకున్నాం. నాడు ఉద్యమ సమయంలో విమర్శలు చేసినా ఆంధ్రా ప్రజలు ఏమీ అనేవాళ్లు కాదు, కేవలం రాజకీయ నాయకులే స్పందించేవాళ్లు. తెలంగాణ వచ్చాక వారిలో కొంత భయం, సోయి ఉండేవి. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రా వాళ్ల విగ్రహాలు పెడుతున్నారు. దానికి కారణం.. ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండటం. ఇది యాధృచ్ఛికం కాదు, మన అస్తిత్వంపై జరుగుతున్న పెద్ద కుట్ర" అని ఆరోపించారు. ఇక్కడ సెటిలైన ఆంధ్రా ప్రజలంతా తమవాళ్లేనని, వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని.. కానీ తమ నీళ్లు, రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. "నేను అసలే మొండిదాన్ని, మీరు అనుకున్నంత మంచిదాన్ని కాదు" అని హెచ్చరించారు.

రాజధాని కట్టడం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లవుతున్నా అక్కడి పాలకులు రాజధాని కట్టుకోలేకపోయారని కవిత ఎద్దేవా చేశారు. "నాడు కలిసున్నప్పుడు మన రాజధాని వసతులపై కన్నేసి కలుపుకున్నారు. ఇప్పుడక్కడ ఉన్న సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీలో కాకుండా పార్లమెంట్‌లో రాజధానిపై తీర్మానం చేయించుకుంది. జగన్ ఏమో 'మావిగన్' అంటూ పొలిటికల్ బాంబు వేశారు. రాజధాని కట్టడంలో సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఆ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికే మహానాడులో మనపై పిచ్చి వాగుడు వాగారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదని మన వాళ్ల చేతనే అనిపించారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవడైనా ఆ మాట అంటాడా? రాజ్యాంగబద్ధంగా సాధించుకున్న తెలంగాణకు మీ డిక్షనరీతో పనేంటి?" అని ప్రశ్నించారు.
పవన్, లోకేష్‌లకు స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణలో నవ నిర్మాణ సభ పెడతామంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబులపై కవిత విరుచుకుపడ్డారు.
"పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు.. ముందు మీ సెక్రటేరియట్ లోకి వానకాలం నీళ్లు రాకుండా చూసుకోండి. ప్రతి వర్షాకాలంలో మీ రాజధాని మునుగుతుంటే ఆంధ్రా ప్రజలకు ఎంత అవమానం? ఆంధ్రా నాయకులకు ఏమైతే ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు కానీ అక్కడ హాస్పిటల్స్ కట్టరు. నెల్లూరు వాళ్లు చెన్నైకి, అనంతపురం వాళ్లు బెంగళూరుకు, విజయవాడ వాళ్లు హైదరాబాద్‌కు రావాల్సిన దుస్థితి ఎందుకు మార్చలేదు? తెలంగాణలో ఎక్స్ టెన్షన్ కావడానికి ఇదేం మీ సామ్రాజ్యం కాదు లోకేష్ బాబు. ఇక్కడి ప్రజలు ఓట్లేయకపోవడం వల్లే ఆంధ్రా పార్టీలు దుకాణం బంద్ చేసుకున్న విషయం మర్చిపోయారా?" అని నిలదీశారు. తెలంగాణ మేధావులైన ప్రొఫెసర్ నాగేశ్వర్, పాపం యాదగిరి వంటి వారు మాట్లాడితే ఆంధ్రా పోలీసులు వచ్చి ఎదురుదాడి చేస్తున్నారని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు. "టీఆర్ఎస్ జెండా రాకముందు ఒకలా, ఇప్పుడు ఒకలా ఉన్నాం. ఇది టీఆర్ఎస్ 2.0.. మాతో పెట్టుకుంటే మంచిగ ఉండదు" అని కవిత స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి.. 'పాంచజనం'తో ముందడుగు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడం లేదని కవిత విమర్శించారు. కేకే, పీకే కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన రేపటి లోగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించాలని డిమాండ్ చేశారు. కోదండరాం లాంటి ఒకరిద్దరికి లాభం జరిగితే సరిపోదని, ఎవరిని చూసి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారో ఆయా నాయకులు ఉద్యమకారుల కోసం కొట్లాడాలన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టుకు ఓకే చెప్పి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ హక్కులు, అస్తిత్వ పరిరక్షణ కోసమే తాము 'పాంచజనం' అనే ఐదు అంశాల విధానంతో ముందుకు వెళ్తున్నామని కవిత ప్రకటించారు. రైతుకు మంచి చేయడం నినాదం కాదు విధానం కావాలని, యువతకు ఉద్యోగాలతో పాటు ఉపాధి కోసం రూ.2 లక్షల నుంచి రూ20 కోట్ల వరకు రుణాలు ఇస్తామని, సామాజిక తెలంగాణ సాధనే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండాలనే అంశంపై మేధావులు, ఉద్యమకారులు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆమె కోరారు.














Click it and Unblock the Notifications