పేదల సొంతింటి కలను సాకారం, ముహూర్తం కుదిరింది
రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన రెండు పడకల గదుల ఇళ్ల (Double bedroom houses) నిర్మాణాలను వేగవంతం చేయడంతో పాటు, ఇంకా ఇళ్లు పొందని అర్హులైన లబ్ధిదారులకు వాటిని కేటాయించడంపై హౌసింగ్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా ఇప్పటివరకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న స్థలాలు లేని పేద కుటుంబాలకు (ఎల్-2 జాబితా) రెండు పడకల ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది.
గతంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.90 లక్షల రెండు పడకల ఇళ్లను మంజూరు చేయగా, వాటిలో 2.31 లక్షల ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు 1.62 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తవగా, అందులో 1.46 లక్షల ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులకు కేటాయించారు. మిగిలిన ఇళ్లలో కొన్ని పూర్తయినప్పటికీ కేటాయింపులు జరగలేదు. మరికొన్ని వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ అన్ని ఇళ్లను సెప్టెంబరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఇటీవల చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 77.68 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో స్థలాలు ఉన్నవారిని ఎల్-1గా, స్థలాలు లేనివారిని ఎల్-2గా, అర్హత లేనివారిని ఎల్-3గా వర్గీకరించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎల్-1 జాబితాలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది.

మొత్తం 21.49 లక్షల మంది..
అయితే, స్థలాలు లేని పేదలైన ఎల్-2 జాబితాపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎల్-2 జాబితాలో ఉన్న పేదలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో మొత్తం 21.49 లక్షల మంది దరఖాస్తుదారులు ఉండగా, అందులో అత్యంత అవసరమైన పేద కుటుంబాలను ఎంపిక చేసి దశలవారీగా ఇళ్లను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
హౌసింగ్ శాఖ పరిధిలోకి ..
ఇదిలా ఉండగా, రెండు పడకల గదుల ఇళ్ల వ్యవహారం పూర్తిగా మళ్లీ హౌసింగ్ శాఖ పరిధిలోకి రావడం గమనార్హం. గత ప్రభుత్వ కాలంలో ఈ శాఖను ఆర్ అండ్ బీలో విలీనం చేసి, జిల్లాల వారీగా ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖలకు బాధ్యతలు అప్పగించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అధికారాలను తిరిగి హౌసింగ్ శాఖకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
రూ.391.23 కోట్లు..
ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనకూ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఆరు నెలల క్రితమే రెండు పడకల ఇళ్ల వద్ద తాగునీరు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు కోసం రూ.391.23 కోట్లను మంజూరు చేసి పనులు ప్రారంభించింది. ఈ పనులను వేగంగా పూర్తి చేసి, అన్ని సదుపాయాలతో కూడిన ఇళ్లను ఎల్-2 లబ్ధిదారులకు అందించాలనే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
మొత్తంగా, గతంలో అర్థాంతరంగా నిలిచిపోయిన రెండు పడకల ఇళ్ల ప్రాజెక్టుకు ఇప్పుడు కొత్త ఊపిరి పోసినట్లయ్యింది. పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా ఈ నిర్ణయం రాష్ట్రంలో కీలక మార్పుకు నాంది పలుకుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications