రాబోతుంది జల సంక్షోభం.. పడిపోయిన భూగర్భ జలం.. చుక్కనీరు కూడా ముఖ్యం!
తెలంగాణలో తాగునీటి సమస్య ఇప్పటికే తీవ్రమవుతోంది. వానాకాలం ముగిసినా మనకు తగినంత నీటి వనరులు రాలేదు. ఒక్క జలాశయం కూడా పూర్తిగా నిండలేదు. చెరువులు, వాగులు ఇంకా నీటి కోసమే చూస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు భారీగా తగ్గిపోయాయి. దీంతో జల సంక్షోభం రాబోతుంది అని స్పష్టంగా తెలుస్తుంది.
రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ డైరెక్టర్ కె.లక్ష్మా విడుదల చేసిన నివేదిక కూడా భవిష్యత్ నీళ్ళ తండ్లాటకు అద్ధం పడుతోంది. గతేడాది సెప్టెంబరుతో పోల్చితే ఈ ఏడాది సెప్టెంబరులో సగటు భూగర్భ జలమట్టం 3.11 మీటర్లు పడిపోయింది. 2025 సెప్టెంబరులో 4.41 మీటర్ల వద్ద ఉన్న జలమట్టం ఈ సంవత్సరం 7.52 మీటర్ల లోతుకు చేరింది. ఇది తాగునీటి సరఫరాకు పెద్ద ప్రమాద సంకేతం.

హైదరాబాద్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గతేడాది సెప్టెంబరులో జిల్లా సగటు 3.57 మీటర్లు ఉండగా, ఈ ఏడాది 10.01 మీటర్లకు పడిపోయింది. మేడ్చల్-మల్కాజిగిరిలో 11.64 మీటర్లు, వికారాబాద్‌లో 11.96 మీటర్లు, రంగారెడ్డిలో 11.74 మీటర్లు, మహబూబ్‌నగర్‌లో 10.51 మీటర్లు, సంగారెడ్డిలో 11.21 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది . బోర్లు ఇప్పటికే చుక్క నీరు రాకుండా మారుతున్న ప్రాంతాలు ఉన్నాయి . నగరాల్లోనూ, పల్లెల్లోనూ తాగునీటికి తీవ్ర ఇబ్బందులు మొదలయ్యాయి.
ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు ఆలస్యం కావడం, వర్షపాతం తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. రాష్ట్ర సగటు వర్షపాతం 18 శాతం లోటుతో నమోదైంది. నల్గొండ, నిర్మల్, హైదరాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ తదితర 19 జిల్లాల్లో తీవ్ర వర్షపాత లోటు నమోదైంది. ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అధికంగా అడుగంటాయి.
పెద్దపల్లి, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల వంటి కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత మెరుగైన పరిస్థితి కనిపిస్తోంది. అయినా మొత్తంగా రాష్ట్ర పరిస్థితి ఆశాజనకంగా లేదు. వాతావరణ శాఖ ప్రకారం ఇకపై పెద్దగా వర్షాలు రావు. అంటే నేలలోకి ఇంకే నీరు మరింత తగ్గుతుంది. అక్టోబరు నుంచి వచ్చే ఏడాది మే నెల వరకు తాగునీటి సమస్య కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
భూగర్భ జలవనరుల శాఖ డైరెక్టర్ కె.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నీటిని ప్రతి ఒక్కరు బాధ్యతగా, పొదుపుగా వాడుకోవాలి. వృథాను అరికట్టడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని స్పష్టం చేశారు. జలాశయాలు నిండకపోవడం, చెరువులు ఎండిపోవడం, బోర్లు వట్టిపోవడం ఇవన్నీ కలిసి రాష్ట్రంలో తీవ్ర జల సంక్షోభం ముంచుకొస్తోందని, కనుక నీళ్ళను ఇప్పటి నుండే పొదుపుగా వాడాల్సిన అవసరం స్పష్టమవుతోంది. ప్రజలు, ప్రభుత్వం కలిసి నీటి పొదుపు చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.












Click it and Unblock the Notifications
