మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. మెట్రోస్టేషన్ల నుండి నేరుగా మీ గమ్యస్థానాలకు..డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఇప్పటికే మెట్రో రైలు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే మెట్రో రైళ్ళలో ప్రయాణం చేసే వారికోసం తెలంగాణా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. మెట్రో ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించేందుకు ప్రభుత్వం కొత్త రవాణా వ్యవస్థపై దృష్టి సారించింది. మెట్రో స్టేషన్‌లో దిగగానే నేరుగా గమ్యస్థానానికి చేర్చే డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు మొత్తం 40.82 కిలోమీటర్ల మేర ఈ నెట్‌వర్క్‌ను నిర్మించాలని ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక సమర్పించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో లీ అసోసియేట్స్ సంస్థ రూపొందించిన నివేదికను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

కూకట్‌పల్లి - రాయదుర్గం 7.62 కి.మీ, రాయదుర్గం - నాలెడ్జ్ సిటీ 12.83 కి.మీ, రాయదుర్గం / హైటెక్ సిటీ - ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 14.01 కి.మీ., సచివాలయం - ఎన్టీఆర్ మార్గ్ 6.36 కి.మీ.ఈ మార్గాల్లో ఏర్పాటుకు ప్లాన్ చేస్తుంది. ఈ వ్యవస్థలో డ్రైవర్లు లేకుండా ఎలివేటెడ్ ట్రాక్‌లపై నడిచే చిన్న పాడ్‌లు ఉంటాయి. ఒక్కో పాడ్‌లో 3 నుంచి 6 మంది ప్రయాణించవచ్చు.
2030 నాటికి రోజుకు 5.42 లక్షల మంది, 2050 నాటికి 20.31 లక్షల మంది ప్రయాణిస్తారని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో దేశంలోనే తొలి పాడ్ ట్యాక్సీ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనపై స్పందిస్తూ, నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పీఆర్‌టీఎస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మెట్రో, ఎంఎంటీఎస్, బస్ స్టేషన్లతో దీన్ని అనుసంధానించాలని, ప్రపంచంలోని ఉత్తమ పీఆర్‌టీఎస్ వ్యవస్థలను అధ్యయనం చేసి పనులను త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే మెట్రో నుంచి ఆఫీస్‌లు, నివాస ప్రాంతాలకు చేరుకోవడం చాలా సులభం అవుతుంది. రోడ్డు రద్దీ, ఆటోలు, బస్సుల కోసం వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం, టికెట్ ధరలు, నిర్మాణ గడువు వంటి వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే ఈ ప్రణాళిక హైదరాబాద్ రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయం ప్రారంభించనుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications
