బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఈడీ నోటీసులు
బీఆర్ఎస్ నాయకుడు, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మరో ముగ్గురికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్(ED) షాకిచ్చింది. భూదాన్ భూముల కుంభకోణంలో మర్రి జనార్ధన్ రెడ్డితోపాటు మరో ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డితోపాటు వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డి, మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చింది. డిసెంబర్ 16న విచారణకు హాజరుకావాలని ఈడీ పేర్కొంది.
ఈడీ ప్రకారం.. సమన్లు పొందిన బిల్డర్‌లలో అమ్మోడ డెవలపర్స్‌కు చెందిన తలసు సూర్య తేజ, కేసీఆర్ మైన్స్‌కి చెందిన కె సిద్దా రెడ్డి ఉన్నారు. వీరు ఈ లావాదేవీల లబ్ధిదారులని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ఐఏఎస్ అధికారి అమోయ్ పాత్ర కూడా పరిశీలనలో ఉంది. అతని స్టేట్‌మెంట్‌లు చాలాసార్లు రికార్డ్ చేశారు.

ఈడీ.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని 50 ఎకరాల భూదాన్ భూమిపై కూడా దర్యాప్తు దృష్టి సారించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద దర్యాప్తు చేస్తున్న ఈడీ హైదరాబాద్ యూనిట్.. ఈ లావాదేవీలు 100 ఎకరాల భూదాన్ భూమికి సంబంధించిన విస్తృత అక్రమాలలో భాగమని వెల్లడించింది. తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు గతంలో అక్రమ లావాదేవీలు జరిగాయని పేర్కొంటూ భూ కేటాయింపుదారులకు తొలగింపు నోటీసులు ఇచ్చింది.
పీఎంఎల్ఏ దర్యాప్తు 2023లో మహేశ్వరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ నుండి వచ్చింది. మెహదీపట్నంకు చెందిన దస్తగిర్ షరీఫ్ మహేశ్వరం కోర్టులో దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 2021 అక్టోబర్‌లో నాగారం గ్రామంలోని 42 ఎకరాల 33 గుంటలకు సంబంధించిన భూమిని ప్రభుత్వ ఆస్తిగా గుర్తించినప్పటికీ.. నకిలీ సేల్ డీడ్‌లు నమోదు చేసి పాసుపుస్తకాలు జారీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇండియన్ స్టాంప్ చట్టంలోని 22-ఎ నిషేధిత కేటగిరీ కింద ప్రభుత్వ భూమిగా జాబితా చేసిప్పటికీ భూమిని అక్రమంగా విక్రయించినట్లు నివేదించారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు ప్రయోజనాల కోసం అన్యాక్రాంతమయ్యేందుకు మోసపూరిత లావాదేవీలను ఉపయోగించారా? అనే విషయాన్ని ఈడీ పరిశీలిస్తోంది. దర్యాప్తు సాగుతున్న కొద్దీ మరిన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications